NDA Vs YSRCP in Legislative Council: శాసనమండలిలో ఎన్డీఏ, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఎన్నికల హామీలు, ఉద్యోగాలపై, వీసీల నియామకాలపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. తొలుత మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చను ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రారంభించారు.
శాసనమండలిలో ఎన్నికల హామీలపై చర్చకు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేను రాజు తెలిపారు. తరువాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండలిలో చర్చ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అసత్యాలే చెప్పారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలు చేశారు. వరుదు కల్యాణి వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు చేసింది ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్సీ దళితులకు గుండు కొట్టించారని, మరొక ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్లోనే ఉన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసిందని స్పష్టం చేశారు.
బెదిరించలేదు: ఎపీపీఎస్సీ ఛైర్మన్‌ను బెదిరించారంటూ వరుదు కల్యాణి చేసిన అవాస్తవ స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలని లోకేశ్ కోరారు. సబ్యురాలి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు వరుదు కల్యాణి ఎగతాళిగా మాట్లాడటం సరైంది కాదన్న లోకేశ్, గత ఐదేళ్లతో వైఎస్సార్సీపీ తీసుకురాలేని నిధులను 5 నెలల్లోనే తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లతో రాజీనామా చేయించింది వైఎస్సార్సీపీ సర్కారే అని, ఇప్పుడు మాపై నిందలు మోపడం సరైంది కాదని నారా లోకేశ్ అన్నారు.
గత వైఎస్సార్సీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ ధ్వంసమైందని, రీసర్వే పేరుతో రికార్డులు తారుమారు చేసి తగాదాలు సృష్టించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని, నిధులన్నీ దారి మళ్లించి వైఎస్సార్సీపీ నేతల జల్సాలకు వెచ్చించారని మండిపడ్డారు. ధ్వంసమైన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని, జగన్ నిర్వాకం చూసి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.
ఆంగ్ల మాధ్యమంపై వాగ్వాదం: ఈ సమయంలో ఆంగ్ల మాధ్యమం అంశంపై కూటమి సభ్యులు, వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే విధంగా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని గవర్నర్ ప్రసంగంలో ముందే ఎలా చెప్పారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణ్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేశ్ వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేశ్ అన్నారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పట్లేదని, పరిశ్రమలు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికల ముందే ఎన్డీయేకు మద్దతు తెలిపామని, మేం పదవులు ఏమీ కోరలేదని, రాష్ట్రానికి నిధులివ్వాలని అడిగామన్నారు. తమపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారని, ఆ విషయం ఏమైందని నిలదీశారు. టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని, డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పామన్నారు. కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు తీసుకువస్తున్నామని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపామని, నిధులు తెచ్చామని గుర్తు చేశారు. రైల్వే జోన్‌ను తీసుకువచ్చింది తామే అనే విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అవరావతికి, పోలవరంకు నిధులు తెచ్చామని తెలిపారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పులివెందుల ఎమ్మెల్యే ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో కేంద్రంలో అన్ని బిల్లులకూ సపోర్టు చేశారని, ఐదేళ్లలో ఏం చేశారో, ఎం తెచ్చారో చెప్పాలని లోకేశ్ నిలదీశారు.
తాము అధికారంలోకి రాగానే రూ.13 వేల కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం తెచ్చిందన్న లోకేశ్, అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సహకారం చాలా అవసరమని అన్నారు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు కల్పించేందుకు 2-3 ఏళ్లు పడతాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారని, 4 లక్షల మందికి ఉపాది అవకాశాలు కల్పిస్తామని గవర్నర్ ప్రసంగంలో తెలిపారని లోకేశ్ స్పష్టం చేశారు.
వీసీల నియామకాలపై విమర్శలు: రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేశారని, వారిని బెదిరించి మూకుమ్మడిగా రాజీనామా చేయించారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపించారు. వీసీలను ఎవరూ బెదిరించలేదు, వాళ్ల రాజీనామాకు ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి లోకేశ్ వివరణ ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు గవర్నర్ ఆధ్వర్యంలో నడుస్తాయని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని మండిపడ్డారు. విపక్ష సభ్యులు గవర్నర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారన్న లోకేశ్, వీసీలను ఎవరూ బెదిరించారో నిరూపించి మాట్లాడాలని సవాల్ విసిరారు.
ఆధారాలు లేకుండా పెద్దల సభలో అసత్యాలు మాట్లాడవద్దన్న లోకేశ్, వర్సిటీల్లో 2019 నుంచి జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని అన్నారు. ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదన్న లోకేశ్, చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ, ఎలాంటి విచారణైనా చేయించుకోండని, ఎవరూ భయపడట్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి, సభలో పరిణామాలు వేరుగా ఉన్నాయని, దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు బొత్స తెలిపారు.
జగన్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది: కూన రవికుమార్
వైఎస్సార్సీపీ తీరు సరికాదు - నియంత్రించకుండా కూర్చుని నవ్వుకుంటారా?: స్పీకర్ అయ్యన్న