Youth Losts Life Due to Betting Apps: ఇటీవల బెట్టింగ్ భూతం పడగవిప్పుతోంది. తొలుత సరదాగా ప్రారంభమై ఆ తరువాత వ్యసనంగా మారి చివరకు ప్రాణాలు బలిగొంటోంది. దీని ఉచ్చులోపడి యువత విలవిల్లాడుతున్నారు. ఏదో ఒకరోజు గెలుస్తామనే ధీమాతో అప్పులు చేసి మరీ యువత బెట్టింగ్ ఆడతారు. తిరిగి ఆ అప్పులను తీర్చే మార్గం లేక ఆందోళనకు గురవుతున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు సులువుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడుతున్నారు. ఆ వ్యసనం నుంచి గట్టెక్కలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న బెట్టింగ్ యాప్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
టీ కేఫ్‌లే వేదికలు: నగరం, పట్టణ పరిసర ప్రాంతాల్లో టీకేఫ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. విద్యార్థులు, యువత కళాశాలలు, పనులు వదులుకుని బృందాలుగా అక్కడికి చేరుకుని గంటలకొద్దీ ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా గొడవలకు దిగుతున్నారు. అలాంటి వేదికలపై పోలీసులు దృష్టి పెడితే ఆన్‌లైన్ గేమ్‌ల నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది.
జిల్లాలో జరిగిన సంఘటనలు:
- జిల్లాలోని ఉరవకొండ మేజర్ పంచాయతీకి చెందిన ఓ యువకుడు బెంగళూరులో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. స్నేహితులతో కలిసి డేటా బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత మొత్తం పోగొట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు ఆడాడు. అవి కూడా పోయాయి. స్నేహితులు సైతం తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. అప్పులు రూ.8 లక్షలకు చేరుకోవడంతో తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై ఈ నెల 8వ తేదీన క్రిమి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్‌లకు పాల్పడి కొడుకును కోల్పోయామని అతని తల్లీదండ్రులు వాపోయారు.
సైబర్ నేరగాళ్ల మాయ ఆటలు - చిన్నారులే వారి టార్గెట్
- విడపనకల్లు మండలంలో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫజిల్ ఆడితే లభించే గోల్డ్‌కాయిన్ ఆధారంగా రెట్టింపు స్థాయిలో డబ్బు వస్తుందని నిర్వాహకులు వల విసిరారు. ఆశపడి బెట్టింగ్ ఆడాడు. ఇది మోసమని గుర్తించే లోపు రూ.16.31 లక్షలు పోగొట్టుకున్నాడు. వ్యవసాయం చేస్తున్న అతనికి ఆన్‌లైన్ గేమ్ ద్వారా తీవ్రంగా నష్టపోయాడు. ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
- పుట్టపర్తి పట్టణానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు రూ.70,000 జీతంతో సంతోషంగా ఉండేవాడు. ఈ సమయంలో ఈ జూదానికి అలవాటుపడి జీతం చాలక అప్పులు చేయడం మొదలుపెట్టాడు. 6 అంకెల జీతం సంపాదిస్తున్న కొడుకుని చూసి సంతోషపడిన తల్లిదండ్రులు ఇటీవల అతడి మానసిక పరిస్థితి చూసి విచారించగా అతను అప్పుల్లో కూరుకుపోయినట్లు గుర్తించి తల్లడిల్లిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా అప్పులు తీర్చి కుటుంబ పరువు కాపాడుకున్నారు. ఇంకెవ్వరూ ఈ మహమ్మారి జోలికి వెళ్లొద్దని వారు కోరుతున్నారు.
ఇలా చేస్తే ఆత్మహత్యలు ఆపొచ్చు: మద్యపానం, జూదం లాగే ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ వ్యసనమని అనంతపురానికి చెందిన ప్రముఖ సైకియాట్రిస్టు గరుగు బాలాజీ అంటున్నారు. ఈ జూదం తీవ్రత పెరిగితే అది వ్యాధిగా మారుతుందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో గ్యాంబ్లింగ్ డిజార్డర్‌ను వ్యాధిగా గుర్తించిందని అన్నారు. ఇది తొలుత కుతూహలంతో ప్రారంభమవుతుందని అంటున్నారు. ఈ జూదంలో ఉన్న మనిషికి కిక్ ఇస్తుందని ఆ సమయంలో డబ్బులు గెలిచినప్పుడు కలిగిన అనుభూతి పదేపదే కావాలని కోరుకుంటారని వివరించారు.
ఆటలో డబ్బులుపోయినా వెనక్కు తగ్గరని అప్పుడు అప్పులు చేసైనా ఆడతారని గరుగు బాలాజి చెప్తున్నారు. ఇలా ఆడి డిప్రెషన్‌కు గురవుతారని అలా తరువాత చివరికి చనిపోవాలనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ వ్యసనానికి అలవాటు పడిన వారికి లేదా చికిత్స ఇప్పించాలని అప్పుడు ఆత్మహత్యలు ఆపవచ్చని సైకియాట్రిస్టు చెప్పారు.
చొక్కాపై ఆత్మహత్య కారకులు - ఆన్‌లైన్ భూతానికి మరో వ్యక్తి బలి
పక్కనే ఉంటూ ఆన్‌లైన్‌లో వేధింపులు! - అశ్లీల సైట్లలోనూ పోస్టులు