YS Sharmila Fires on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. అవకాశం దొరికితే చాలు ముఖ్యమంత్రి చేసిన అక్రమాలు, అవినీతిని ప్రజల్లో ఎండగడుతున్నారు. తాజాగా బాపట్లలో షర్మిల సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల్ని జగన్ మోసం చేశారంటూ నిప్పులు చెరిగారు.
జగన్ పాలనలో రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గిట్టుబాటు ధర మాత్రమే కాకుండా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు, తుపాను ప్రభావంతో, కరవు పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతే, రైతులకు పరిహారం అందించి ఆదుకోలేని దుస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్, చంద్రబాబుకు షర్మిల లేఖ - అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్
బాపట్ల నియోజకవర్గంలో అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాతో తీరిక లేకుండా ఉన్నారని షర్మిల ధ్వజమెత్తారు. అక్రమాలు, అవినీతి మీద దృష్టి పెట్టి, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రోడ్లు అయిన సరిగా లేవని మండిపడ్డారు. అధ్వాన్నంగా మారిన రోడ్ల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
అధికారం కట్టబెడితే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని సీఎం జగన్ అన్నారని వైఎస్ షర్మిల పునురుద్ఘటించారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే నాలుగున్నర సంవత్సరాల్లో ఎలాంటి పోరాటం చేయకుండా ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తానని ప్రజలను నమ్మించిన జగన్, కనీసం ఒక్కసారైనా కేంద్రాన్ని ప్రశ్నించలేదని ధ్వజమెత్తారు.
"వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే చిత్తశుద్ధి ఉందా"
పెద్దపెద్ద కోటలు కట్టుకున్న జగనన్న ప్రజల మధ్యకు రారు. ఎన్నికలు ఉన్నాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారు. దేనికి సిద్ధం జగన్ సార్?. మళ్లీ రూ.8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? ప్రత్యేక హోదాను మళ్లీ బీజేపీ వద్ద తాకట్టుపెట్టడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇళ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా? రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాకు సిద్ధమా? మీరు సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. ప్రత్యేక హోదాపై జగనన్న చేతులు ఎత్తేశారు. బీజేపికి మెజారిటీ వస్తుందని ఏమీ చేయలేమంటున్నారు. రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని ఇన్నాళ్లూ అడగలేదు. నా పుట్టింటికి మేలు చేయాలనే తపన నాలో ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం వచ్చేంత వరకు పోరాడుతా. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తే హోదా రాదు.
ఏపీకి హోదా రావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం. తలెత్తుకునేలా రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలి. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలి. వైఎస్‌ఆర్ గుర్తుతో గెలిచి ఆయన ఆశయాలు మరిచారు. -బాపట్ల బహిరంగ సభలో షర్మిల
పీసీసీ చీఫ్ షర్మిల కూడా సిద్ధమే! - జిల్లాల పర్యటన, బహిరంగ సభలు
ప్రభుత్వం తనకు భద్రత కల్పించలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు భద్రతను కల్పించడం లేదంటే, తన చెడు కోరుకున్నట్లే కదా అంటూ ధ్వజమెత్తారు. ప్రజాసామ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. బాపట్ల కాంగ్రెస్ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు షర్మిల హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె నేరుగా బాపట్లకు బయల్దేరి వెళ్లిపోయారు.
"రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని, ప్రభుత్వం నాకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ప్రభుత్వం అవేమి పట్టనట్లుగా, మేము అడిగిన కూడా సెక్యూరిటీ కల్పించడం లేదు. అంటే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నాం" - వై. ఎస్ షర్మిల, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు
వైఎస్ షర్మిల, సునీతపై అసభ్యపోస్ట్లు పెడుతున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్