CM Revanth Join in YS Rajasekhara Reddy Birth Anniversary :తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ అభిమానులకు కొదవలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ను తామంతా కుటుంబసభ్యుడిలా భావిస్తామని తెలిపారు. ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమన్న రేవంత్‌రెడ్డి, 2007లో వైఎస్ ముందు అనేక విషయాలు ప్రస్తావించానని గుర్తు చేసుకున్నారు.
మండలిలో మాట్లాడినప్పుడు వైఎస్ తనను ప్రోత్సహించేవారన్నారు. కొత్త సభ్యుల మాటలు కూడా వినాలని వైఎస్ చెప్పేవారని, ప్రతిపక్ష సభ్యుల విషయంలోనూ ఉదారంగా ఉండేవారని కొనియాడారు. కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్ ప్రయత్నించేవారన్నారు. చేవెళ్ల-ఇచ్ఛాపురం పాదయాత్రతో 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చారన్న రేవంత్, ఏ పదవీ రాకున్నా కూడా వైఎస్ పార్టీని వదల్లేదని తెలిపారు.
ఏపీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నది షర్మిలమ్మనే : ఈ రాష్ట్రంలో వైఎస్ షర్మిలమ్మ అలుపెరగని పోరాటం చేస్తున్నారని, 1999లో వైఎస్ పోషించిన పాత్రను షర్మిల ఇప్పుడు పోషిస్తుందని ప్రశంసించారు. ఏపీలో ప్రతిపక్షమే లేదన్న రేవంత్‌రెడ్డి, బాబు, జగన్, పవన్ అందరూ పాలకపక్షమే అని విమర్శించారు. ఏపీలో ప్రతిపక్ష నేత పాత్ర షర్మిల పోషిస్తున్నారని అన్నారు. వైఎస్ జయంతి సభకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, మల్లిఖార్జున ఖర్గే తనను కోరారన్న రేవంత్, అనివార్య కారణాల వల్ల ఖర్గే ఈ సభకు రాలేకపోయారని తెలిపారు.
"శాసనమండలి సమావేశాలు వస్తున్నాయంటే, సమస్యలను ప్రస్తావించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టిని ఆకర్షించాలని, రాత్రంతా చదువుకొని మరీ మండలికి వెళ్లిన రోజులు ఉన్నాయి. కొత్తగా సభలోకి వచ్చే సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్లను ప్రోత్సహించాలి, తద్వారా నాయకత్వం బలపడుతుందని చెప్పి వైఎస్‌ఆర్ ఆనాడు మాట్లాడారు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి