YS Jagan Illegal Assets Case : జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ మళ్లీ మొదటికొచ్చింది. డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తికాగా తీర్పు వెలువరించాల్సి ఉండగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యి వెళ్లిపోయారు. దీంతో డిశ్చార్జి పిటిషన్ల విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు శుక్రవారం నుంచి విచారణ జరపనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ సహా 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ కొనసాగుతోంది.
పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినా : సీబీఐ కోర్టులో పెండింగ్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లను పరిష్కారించేందుకు గతంలో గడువు విధించినా ప్రయోజనం లేకపోయింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో పెండింగ్లో ఉన్న 130కు పైగా డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తి అయినా తీర్పు వెలువడలేదు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. గత ఏడాది నవంబరు నుంచి ఒక్కదానిలోనూ తీర్పు వెలువడలేదు.
జగన్ కేసుల విచారణలో జాప్యం ఎందుకు? : మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు జాప్యం అవుతోందంటూ గతంలో సుప్రంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ సమయంలో ట్రయల్ సవ్యంగానే జరుగుతోందని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదని, అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది.
పదకొండేళ్లుగా విచారణ :ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయ సాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్ అధికారులు మన్మోహన్‌సింగ్, బీపీ ఆచార్య, శామ్యూల్, జి.వెంకట్రామిరెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు దాదాపు 130కు పైగా డిశ్ఛార్జి పిటిషన్లను దాఖలు చేశారు. 2013వ సంవత్సరం నుంచి దాఖలైన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ ఇప్పటి వరకు పూర్తి కాలేదు.