Young Woman Died in Tiger Attack in Asifabad :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఈ ఉదయం కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారంలో పెద్దపులి దాడిలో ఓ వివాహిత మృతి చెందటం సంచలనం రేకెత్తించింది. పులుల సంచారం పెరిగినా, అటవీ శాఖ యంత్రాంగం అంటీముట్టనట్లు వ్యవహరిస్తోందంటూ స్థానికులను ఆందోళనకు దిగారు.
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ పులిదాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఉదయం వ్యవసాయ కూలీలతో కలిసి చేనుకు వెళ్లిన లక్ష్మి, పత్తి తీస్తుండగా వెనక నుంచి పెద్దపులి దాడి చేసింది. భయాందోళనలకు గురైన కూలీలంతా అరుపులు, కేకలు వేయటంతో పులి సమీప అటవీ ప్రాంతానికి పారిపోయింది. తీవ్రగాయాలైన లక్ష్మిని, సహచర కూలీలు, స్థానికులు హుటాహుటిన కాగజ్‌నగర్ తీసుకువెళ్లి చికిత్స అందించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆ మహిళ చివరకు తుది శ్వాస విడిచింది. లక్ష్మి మృతదేహాన్ని తీసుకుని, గ్రామస్థులు కాగజ్‌నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసినా, అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు.
మహిళ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం :పులి దాడి ఘటనపై స్పందించిన అటవీశాఖ, మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. బాధితులతో ఆసిఫాబాద్ డీఎఫ్‌వో శాంతారాం, కాగజ్‌నగర్ ఆర్డీవో లోకేశ్ చర్చించారు. అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.20 వేలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మృతురాలి భర్తకు అటవీ శాఖలో వాచర్ ఉద్యోగం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 5 ఎకరాలు ఇవ్వాలని సిఫారసు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు శాంతించి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.