Youth Set up Flexi Against Bribe in Local Elections : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు అంటూ ఓ తండాలో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బిచ్చానాయక్, రాజీవ్ నగర్ తండాల్లో చోటుచేసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో) పోటీ చేసే అభ్యర్థులు గ్రామంలోని ఓటర్లకు డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దంటూ కొందరు యువకులు గ్రామ కమిటీ కుర్రాళ్ల పేరిట తండాలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా తండాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఫ్లెక్సీలో ఏం రాసి ఉందంటే : అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే చేయండని, కానీ ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, వెంట తిప్పి తినిపించడం, మద్యం తాపించి తాగుబోతులుగా మార్చకండని హెచ్చరించారు. నిజాయతీగా రాజకీయాలు చేసుకోండని విజ్ఞప్తి చేశారు. అంతలా డబ్బులు ఖర్చు చేయాలనిపిస్తే గ్రామంలో ఏదైనా మంచిపని చేయాలని సూచించారు. కాదు, కూడదని ఊరిని ఆగం చేయాలని చూస్తే, ఏ మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఆధారాలు సేకరించి పోలీసులకు పట్టిస్తాం జాగ్రత్త అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.