Younger Brothers killed Elder Brother With Knives :మేడ్చల్ జాతీయ రహదారి-44పై పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అతని తోడబుట్టిన తమ్ముడు, చిన్నాన్న కుమారుడు వెంటాడి, వేటాడి కత్తులతో పొడిచి చంపిన ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గుగులోత్ గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉమేశ్(24), రాకేశ్(22), కుమార్తె హరిణి ఉన్నారు. వీరంతా మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉమేశ్‌కు భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు చాలా కాలంగా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. వారిపై పలుమార్లు ఇష్టం వచ్చినట్లు తిడుతూ దాడి కూడా చేశాడు.
మద్యం సేవించి దాడి : కొద్దిరోజుల క్రితం మద్యం సేవించి తల్లిదండ్రులతో పాటు తమ్ముడిపై, అతడి భార్యపై కూడా దాడి చేశాడు. ఆదివారం మళ్లీ గొడవకు దిగాడు. దీంతో ఉమేశ్‌తో రాకేశ్, అతడి చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్, మరో ముగ్గురు వాదనకు దిగారు. ఉమేశ్ బీరుసీసాతో దాడి చేయగా వారు ఎదురుదాడి చేశారు. దీంతో ఉమేశ్ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగెత్తుకుంటూ జాతీయ రహదారిపైకి వెళ్లాడు. అయినా రాకేశ్, లక్ష్మణ్ అతన్ని వదిలి పెట్టలేదు. కత్తులతో కసితీరా 15 సార్లు పొడవడంతో ఉమేశ్ అక్కడికక్కడే చనిపోయాడు.