Yeru Festival at Bhadradri :తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ అందాలు మారేడుమిల్లి పాపికొండలు బొర్రా గుహల పేర్లు వినిపిస్తుంటాయి. అదేస్థాయిలో పర్యాటకులకు అనుభూతులను పంచేందుకు ‘ఏరు’ ఉత్సవం వేదికవ్వనుంది. నీటివనరులను ఆస్వాదించేందుకు భద్రాచలం మన్యం కేంద్రంగా సాగేటువంటి ఈ యాత్ర పూర్తిగా ప్రకృతితో మమేకం చేస్తుంది.
దైనందిన యాంత్రిక జీవితంలో అలసినవారు సంతోషాలను ఏరుకునే యాత్ర ఇది. మొదటి విడతగా ఏరు ఉత్సవాన్ని గురువారం ప్రారంభించి శనివారం వరకు కొనసాగిస్తారు. ఆ తర్వాత ప్రతి 3 రోజులకు ఒక ప్యాకేజీ కింద టూరిస్ట్‌లను ఆహ్వానిస్తారు. స్నానఘట్టాల వద్ద ఆహార పదార్థాలు, హస్త కళారూపాలను స్టాళ్లలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పీఓ రాహుల్ చొరవతో ‘రివర్ ఫెస్టివల్’కు రూపకల్పన జరగటంతో భద్రాద్రి జిల్లా పర్యాటకానికి మహర్దశ పట్టనుంది.
మూడు రోజుల యాత్ర ఇలా :
1. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు భద్రాచలంలోని గోదావరి ఒడ్డున ఏర్పాటుచేసినటువంటి క్యాంప్ కుటీరాలకు పర్యాటకులు చేరుకుంటారు. వీటిలో ఇద్దరు, ముగ్గురు, నలుగురు చొప్పున ఉండే విధంగా అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. యాత్రికులకు టీ లేదా కాఫీ, బిస్కెట్లు ఇస్తారు. బోట్ షికారును కూడా చేయవచ్చు. సాయంత్రం 5 గంటలకు ఘాట్‌పై సాంస్కృతిక ప్రదర్శనలు అలరిస్తాయి. రాత్రి 8 గంటలకు క్యాంప్ కుటీరాలకు చేరుకుని క్యాంప్ ఫైర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. పర్యాటకులకు రాత్రి భోజనం అక్కడే ఉంటుంది.
2. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవచ్చు. 7 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, 8 గంటలకు కిన్నెరసాని బోట్ షికారు, మధ్యాహ్నం 12కి భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి కార్యాలయంలోని మ్యూజియాన్ని సందర్శిస్తారు. ఇక్కడ సృష్టించినటువంటి ఆదివాసీ పల్లెను చూడవచ్చు. అక్కడే మధ్యాహ్న భోజనం చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బొజ్జిగుప్ప అనే ఆదివాసీ పల్లెను సందర్శిస్తారు. యాత్రికులకు అక్కడే రాత్రి భోజనం ఉంటుంది. అక్కడి వాగులో సరదగా బోటింగ్ చేయవచ్చు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలను వీక్షించవచ్చు. రాత్రి 8 గంటలకు తిరిగి క్యాంప్ కుటీరాలకు చేరుకుని బస చేస్తారు.
3. శనివారం ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసి చంద్రుగొండ మండలం కనిగిరిగుట్ట టెక్కింగ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టీ, స్నాక్స్‌తో పాటు లంచ్ కూడా ఉంటుంది. గుట్టపై నుంచి ప్రకృతి అందాలను యాత్రికులు ఆస్వాదించవచ్చు. మధ్నాహ్నం ఒంటి గంటకు కొత్తగూడెం చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది. మూడు రోజుల ప్యాకేజీలో టికెట్ ధర పెద్దలకు ఒక్కొక్కరికి 6వేలు రూపాయలు, 12ఏళ్లలోపు పిల్లలకు రూ.4వేలుగా నిర్వాహకులు నిర్ణయించారు.
"మా ప్రాంతం ములకలపల్లి మండలం. మాలాంటి 10 మంది మహిళలకు ఆవులు, గేదెలు ఉండటంతో స్వచ్ఛమైన నెయ్యిని విక్రయిస్తున్నాం. దీనికి అధికారుల నుంచి ధ్రువపత్రం ఉంది. రాములోరి క్షేత్రంలో ఏరు ఉత్సవాల వేడుకల సందర్భంగా స్టాల్ ఏర్పాటుకు మాకు అవకాశం లభించింది. ఆదరణ బాగుండటం వల్ల ఈ రంగంలో రాణిస్తామనే నమ్మకం కలిగింది"- టి.మంజుల, జి.లత
ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - మాల్దీవులను మరిపించే టూరిస్ట్ స్పాట్ మన రాష్ట్రంలోనే
మీరు గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా? - అక్కడ ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు పోతాయ్