Yadadri Temple EO Transfer :యాదాద్రి ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ రామకృష్ణపై బదిలీ వేటు పడింది. ఆలయ నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11న యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం సీఎంకు, మంత్రులకు వేద బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం, మిగతా మంత్రుల కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలకు చిన్న పీటలు వేశారు. ఈ విషయంపై వివాదం రాజుకుంది. మంత్రులకు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై బదిలీకి కారణమని సమాచారం.
యాదాద్రి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు- వటపత్రశాయి అలంకారంలో స్వామివారు
అయితే విపక్షాల ఆరోపణలను మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తానే కావాలని చిన్న పీటపై కూర్చున్నానని తెలిపారు. బదిలీ వేటు పడిన రామకృష్ణరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేశారు. మాజీ ఈవో గీతారెడ్డిని తొలగించిన తరువాత ఆయనకు యాదాద్రి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రామకృష్ణరావు స్థానంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుని ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.