World Telugu Writers Conference : తెలుగు మహాసభలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి సభలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలని, వారిని సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు తెలిపారు. ఆదివారం రామోజీరావు సభా వేదికపై మహాసభల విజయానికి సహకరించినటువంటి వారిని ఘనంగా సత్కరించారు.
తెలుగు మహాసభలు విజయవంతం :అనంతరం గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ ధనం ఉంటేనే బలమని, ఏదైనా కార్యక్రమం సజావుగా జరగాలంటే ధనమే మూలమన్నారు. తెలుగు మహాసభలకు విచ్చేసిన వారికి వదాన్యులు ఆర్థికంగా సహకరించడంతో విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు. మహాసభల ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి ఎంతో మంది రచయితలు వచ్చి వారి వారి కవిత్వాలు చదివారని, వారంతా సంతోషంగా పాల్గొనేందుకు ముఖ్య కారణం దాతలనేని వివరించారు.
తెలుగు మహాసభలకు మొత్తం 44 మంది వదాన్యులను ఆహ్వానించగా, 20 మందికి పైగా హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. వారందరినీ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మహాసభల గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్‌లు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
తెలుగువారి సంఖ్యను కావాలనే తగ్గించి చూపుతున్నారు : తమిళనాడు, మహారాష్ట్ర కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారి జనాభాను కావాలనే తగ్గించి చూపిస్తున్నారని రాష్ట్రేతర తెలుగువారు ఆందోళన వ్యక్తం చేశారు. జనగణనలోనూ లోపాలున్నాయని వారు ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సుమారు 30 శాతం వరకు తెలుగువారు ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 5.6 శాతమే ఉన్నట్టు ఏవిధంగా చెబుతారని వారు ప్రశ్నించారు.