Women Gets 5 Government Teaching Jobs :నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన షర్మిలకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అని కల. కుటుంబంలో అందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే కావడంతో తనకు కూడా టీచర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే విద్యను అభ్యసించిన ఈమెకు ఇంగ్లీషు మాధ్యమం కష్టమనిపించినా రెండు పీజీలతో పాటు బీఈడీ సైతం పూర్తిచేసింది ఈ మహిళ.
సాధించాలనే సంకల్పం ఉన్నా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ముందుకు అడుగేయాలి అంటోంది షర్మిల. భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాలని శ్రమించింది. టీచర్ ఉద్యోగంపై ఉన్న మక్కువతో ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. అయినా, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి చక్కని ప్రణాళికతో పట్టుదలగా పోటీ పరీక్షలపై దృష్టి సారించింది. ఫలితంగా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, 2 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలతో పాటు 2 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను కైవసం చేసుకుంది.
ఎంతో మంది ఏళ్ల తరబడి పోరాడినా ఫలితం దక్కని సందర్భాలు ఉంటాయి. కానీ ఈ మహిళ అందుకు భిన్నం. ఇంగ్లీషు మాధ్యమంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పట్టువదలకుండా శ్రమించింది. సహజంగా కెమిస్ట్రీ అంటేనే చాలా మందికి అంతుచిక్కని అంశం. అలాంటి సబ్జెక్ట్‌ను అవపోసన పట్టడమేకాకుండా దానితో పాటు జువాలజీ సబ్జెక్ట్‌లో ప్రతిభ కనబరిచి రెండింటిలోనూ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కైవసం చేసుకుంది. అంతేకాదు భవిష్యత్తులో నీట్ విద్యార్థులకు బోధిస్తానంటోంది ఈ మహిళ.
"నాకు చిన్నప్పటి నుంచి కెమిస్ట్రీ టీచింగ్ చేయాలని ఉండేది. ముందుగా నేను అనుకున్న సబ్జెక్టులో రాలేదు. తర్వాత వచ్చింది. తెలుగు మీడియంలో చదువుకున్న నేను ఇంగ్లీష్ చాలా కష్టంగా అనిపించింది. ఆరు పరీక్షలు రాస్తే అందులో 5 ఉద్యోగాలు నాకు వచ్చాయి."- షర్మిల