Woman Commits Suicide by Fear of Hydra in Kukatpally : హైడ్రా కూల్చివేతలకు భయపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తమ ఇళ్లను హైడ్రా కూల్చి వేస్తుందేమోనని బెంగతో ఉరేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, కూకట్‌పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ (56), శివయ్య యాదవ్ దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 22న కూకట్‌పల్లి నల్ల చెరువు పరిధిలోని 16 కట్టడాలను ‘హైడ్రా’ అధికారులు కూల్చివేయగా, వాటికి ఎదురుగానే బుచ్చమ్మ, శివయ్యకు రెండు ఇళ్లు, ఓ షెడ్డు ఉన్నాయి.
ఈ మూడింటిని వారు తమ ముగ్గురు కుమార్తెలకు రాసిచ్చారు. ఈ క్రమంలో అధికారులు నల్ల చెరువులోని కట్టడాలను కూల్చి వేసినప్పటి నుంచి బుచ్చమ్మ దిగులుగా ఉన్నారు. తమ కుమార్తెలకు రాసిచ్చిన ఇళ్లు, షెడ్డును కూడా కూలుస్తారేమోనని భయంతో అందిరితోనూ చెబుతూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి కుమార్తె సరిత తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, కూకట్‌పల్లి ఎస్సై దీక్షిత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బుచ్చమ్మ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు : తాజాగా దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ ఆత్మహత్యకు, హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. బుచ్చమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూకట్‌పల్లి సరస్సు సమీపంలో ఉంటోందని, తమకు తల్లిదండ్రులు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తారేమోనని కూతుళ్లు భయంతో దాని గురించి తల్లిని ప్రశ్నించారని తెలిపారు. ఈ క్రమంలో కుమార్తెల ప్రశ్నలకు బుచ్చమ్మ ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుందని వివరించారు. హైడ్రా గురించి భయాందోళనలు సృష్టించడం మానేయాలని మీడియాను, ముఖ్యంగా సోషల్ మీడియాను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు.