Woman and her Ex Husband Job Fraud in Hyderabad : ఆ దంపతులు విడిపోయినా మోసం చేయడంలో మాత్రం కలిసే ఉన్నారు. బడా కంపెనీల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకున్నారు ఈ మాజీ భార్యాభర్తలు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకకు చెందిన నిరుద్యోగులే లక్ష్యంగా వీరి దోపిడి జరుగుతుంది. మోసం చేసి నిరుద్యోగుల జీవితాలను నిలువునా ముంచేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కిలాడీ ఆటకట్టించగా, మాజీ భర్త పరారీలో ఉన్నాడు.
కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీ, రేష్మ అలియాస్ స్వప్న 2009లో హైదరాబాద్‌కు వచ్చారు. ఇన్‌స్టాంట్ ఐటీ జాబ్స్ కన్సల్టెన్సీలో అలీ మేనేజర్‌గా రేష్మ టెలీకాలర్‌గా పనిచేసేవారు. 2013లో వీరిద్దరూ వివాహం చేసుకుని 2022లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగాల నియామక ప్రక్రియ మీద అవగాహన పెంచుకున్నారు. దీంతో జాబ్ ఆఫర్స్ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేయాలని పథకం వేశారు. విడాకుల తర్వాత రేష్మ మరొకర్ని పెళ్లాడినా మాజీ భర్తతో సంబంధాలు కొనసాగిస్తోంది. అతడితో కలిసి మోసాలకు పాల్పడుతోంది.
వివిధ వెబ్‌సైట్లలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల వివరాలు సేకరించింది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థలో మానవ వనరుల విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నానని, బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు కాల్స్ చేసేది. ఉద్యోగం కావాలనుకుంటే అడ్వాన్సు కింద కొంత మొత్తం ఇవ్వాలని చెప్పేది. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం వచ్చినట్లుగా ఐబీఎం, కాగ్నిజెంట్ పేర్లతో ఉన్న మెయిల్‌ఐడీల ద్వారా నియామకపత్రం పంపించేవారు. ఆ తర్వాత కనిపించకుండాపోవడం పరిపాఠిగా మారింది. ఈ ఏడాది ఆగస్టులో ఎంబీఏ పూర్తి చేసిన యువతితో పాటు మరికొందర్నీ రేష్మ ఇలాగే మోసగించింది.