Couple Suicide In Chevella :పెళ్లి అనేది ఓ అందమైన జీవితం. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్టసుఖాల్లో తోడునీడుగా ఉంటూ ముందుకు సాగాలి. అప్పుడప్పుడూ ఇద్దరి మధ్య గొడవలు రావడం సహజమే. కాసింత కష్టానికే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఘారమైన నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులను ఒంటరివారిని చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని చన్వెళ్లిలో క్షణికావేశంలో భార్య ఆత్మహత్య చేసుకోగా, ఆమె తమ్ముడు బావపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో మనోవేదనకు గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పోలీసుల వివరాల ప్రకారం : మండలంలోని చన్‌వెళ్లికి చెందిన ఆలూరు రాజు (34), వనజ దంపతులు భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత శనివారం ఇద్దరూ ఇంట్లో గొడవపడ్డారు. వనజ పురుగు మందు తాగడంతో ఆసుపత్రికి తరలించగా, ఆదివారం మృతి చెందింది. దీంతో భర్త వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. మంగళవారం పోలీసులు రాజును స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్డ రాజు, బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాథలుగా మారిన పిల్లలు : తల్లిదండ్రులు గొడవపడి ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు పిల్లలు పాప (11), బాబు(9) అనాథలుగా మారారు. అమ్మానాన్న చనిపోయారని తెలిసి, ఆ చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని గ్రామస్థులు కంటతడి పెట్టారు.