Wife brutally kills husband :మానవత్వానికే మాయని మచ్చతెచ్చే ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాళి కట్టిన భర్తను గొడ్డలితో విచక్షణారహితంగా చంపింది ఓ భార్య. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(50), ఎల్లమ్మ భార్యాభర్తలు. ఊర్లోనే ఉంటూ కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రించారు ఈశ్వరయ్య.
గొడ్డలితో నరికి దారుణహత్య :అయితే శనివారం మధ్యాహ్నాం 12 గంటలు దాటినప్పటికీ ఇంటితలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి గ్రామ పెద్దలకు సమాచారమిచ్చారు. గ్రామస్తులు ఇంటి తలుపులు తెరిచి రక్తపు మడుగులో పడున్న ఈశ్వరయ్య మృతదేహాన్ని చూసి అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈశ్వరయ్యను అతని భార్య గొడ్డలితో నరికి హత్య చేసినట్లుగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుని భార్యతో పాటు అల్లుడు, కుమార్తెలు పరారీలో ఉండడంతో పోలీసులు వారిపై అనుమానంతో దర్యాప్తు చేపట్టారు.