White Paper Debate on Irrigation Sector in Telangana Assembly : ప్రభుత్వం నీటిపారుదల రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చర్చను ప్రారంభించారు. నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సవాళ్లతో పాటు వివిధ ప్రాజెక్టుల అమలు, పురోగతి, వాటి నీటిపారుదల సామర్థ్యంతో పాటు రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చుపెట్టినా, వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు.
Medigadda Barrage Collapse Issue Assembly Debate :గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే సభలో శ్వేతపత్రాన్ని(White Papers) ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం(Kaleshwaram Project) ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు కల్పించామని, పాత ఆయకట్టు స్థిరీకరణ చేశామని చెప్పారు. ఇందుకు పండిన పంటలే నిదర్శనమని పేర్కొన్నారు. జలయజ్ఞం కింద పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని హరీశ్‌రావు ఆరోపించారు.
నాటి కాంగ్రెస్ సర్కారు ప్రాణహిత-చేవెళ్లకు 8ఏళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాకుండా మొబిలైజేషన్, సర్వేల పేరుతో వ్యయం చేశారంటూ తప్పుబట్టారు. హరీశ్ వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేవలం రూ.28 వేల కోట్లతో అయిపోయే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించకుండా, కాళేశ్వరం పేరిట రూ.1.47 లక్షల కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ముమ్మాటికీ గుదిబండేనని ఆయన అన్నారు. జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోకపోతే ఎలానని ప్రశ్నించారు.
"గతంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.17,829 కోట్లను మంజూరు చేశారు. ఏడాదిన్నర లోపే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.35వేల కోట్లకు పెంచారు. నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రాజెక్టు, ఎనిమిదేళ్లు అయినా కనీసం ఒక్క అనుమతి కూడా తేలేకపోయిందంటే తెలంగాణ పట్ల మీకు ఉన్న నిర్లక్ష్యం కాదా? కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో నీళ్లేలేవు ప్రత్యామ్నాయం చూసుకోండంటేనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. దురదృష్టకరం కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. దానికి విచారణ జరపాలి."- హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
అది శ్వేతపత్రం కాదు, ఫాల్స్ పేపర్ - గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే : హరీశ్‌రావు