తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ మై గాడ్‌ షాపింగ్‌ ఇంత ఈజీనా? - ఇంటి ముందుకే ‘ఫ్యాషన్‌ ట్రక్స్‌’ - ఫీచర్స్​ మామూలుగా లేవుగా!

బంగారం, బట్టలు ఏం కొనాలన్నా.. దుకాణమే మీ ఇంటికొస్తుంది. ఏంటీ నమ్మట్లేదా..? నిజమండీ ' పాత పద్ధతిలోని సౌకర్యాన్ని కొత్త తరానికి పరిచయం చేస్తూ నయా ట్రెండ్‌ను తీసుకొచ్చాయి కొన్ని దుకాణాలు.

Shopping Mall at Home
Try and buy at home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Shopping Mall at Home : దుకాణానికి వెళ్లి షాపింగ్‌ చేసే టైం లేదు, ఆన్‌లైన్లో ఆర్డర్‌ పెడితే అవి రావడానికి కొంత ఆలస్యం అవుతుంది, పైగా వచ్చాక అవి ఎలా ఉంటాయో తెలియదు! అందుకే ఈ సమస్యలన్నింటికీ చెక్‌పెడుతూ వచ్చిందో సరికొత్త రకం షాపింగ్‌ ట్రెండ్‌. అదే ‘ట్రై అండ్‌ బై ఎట్‌ హోమ్‌’. అవునండీ.. బంగారం దగ్గర్నుంచీ బట్టల కొనుగోలు వరకూ మన ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నాయి అన్నీ!

ఇప్పుడంటే ఏమి కావాలన్నా, షాపింగ్‌ చేయడానికి పెద్ద పెద్ద మాల్స్‌లాంటివి బోలెడు కనిపిస్తాయి. కానీ అమ్మమ్మల కాలంలో పరిస్థితి వేరు. బట్టలు అమ్మేవాళ్లే మూటలతో ఊరూరా తిరుగుతూ ఇళ్ల ముందుకు వచ్చేవాళ్లు. కావాలంటే వాకిట్లోకి పిలిచి బేరసారాలు చేసి నచ్చితే కొనేవాళ్లు, లేదంటే లేదు. ఇదిగో ఇప్పుడా పాత పద్ధతిలోని సౌకర్యాన్ని నవ తరానికి పరిచయం చేస్తూ నయా ట్రెండ్‌ను తీసుకొచ్చాయి కొన్ని దుకాణాలు. పైగా ‘ట్రై అండ్‌ బై’ అంటూ ‘వేసుకుని చూసి నచ్చితేనే తీసుకోండి’ అంటూ మన చెంతకే పట్టుకొస్తున్నాయి.

మనకు నచ్చితేనే డబ్బులు చెల్లించే అవకాశం : ఇల్లూ, ఆఫీసూ పనులతో గంటలతరబడి బయటకెళ్లి షాపింగ్‌ చేయలేక, ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నవాటినే సెలక్ట్​ చేసుకొని ఆర్డర్‌ పెట్టుకుంటున్నారు. దీంట్లో వస్తువు తీసుకోగానే కచ్చితంగా డబ్బులు పే చేయాలి. ఇంకా అది వెబ్‌సైట్లో చూపించినట్టు ఉండకపోతే మళ్లీ దాన్ని వాపస్​ పెట్టాలి. అసలీ గొడవంతా ఎందుకు.. ఇంటికే కోరిన వస్తువును తీసుకొచ్చి, అది మనకు నచ్చితేనే డబ్బులు చెల్లించే అవకాశం ఉంటే.. ‘ఓ మై గాడ్‌, సూపర్‌ ఐడియా’ అంటారా- సరిగ్గా ఆ ఆలోచనతోనే అడుగేస్తోంది ఈ హోమ్‌ షాపింగ్‌.

బంగారు ఆభరణాలూ, వజ్రాల నెక్లెసులూ, ప్లాటినం ఛైన్స్, వెండి నగలూ.. ఇలా మనకు కావాల్సినవేవైనా ఆన్‌లైన్లో అమ్ముతూ ఎన్నో ప్రఖ్యాతి జ్యువెలరీ షాపులు అందుబాటులో ఉన్నాయి. వాటి వెబ్‌సైట్‌లలో నచ్చిన నగను నేరుగా చూడకుండా కొనుక్కునే బదులు- ఇంటికి తెప్పించుకుని వేసుకుని, ఇష్టమైతేనే అప్పుడు అమౌంట్ కట్టొచ్చు. దేశంలోని నగరాలూ, పట్టణాలతోపాటు మన దగ్గర హైదరాబాద్‌, వైజాగ్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ‘క్యారట్‌లేన్‌, బ్లూస్టోన్‌, వైభవ్‌, కపిష్‌.. లాంటి కొన్ని ఆభరణాల షాపులు ఈ సేవల్ని అందిస్తున్నాయి.

కొనాలనుకున్న నగల్ని సెలక్ట్​ చేసుకుని ఇంటి అడ్రస్, తేదీ, సమయం లాంటి వివరాలతో ముందుగానే అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలి. దాని ప్రకారం వాటితో ఆ దుకాణం వాళ్లు మనం చెప్పిన చోటుకి వస్తారు. అయితే దీనికి ఎలాంటి మనీ కట్టక్కర్లేదు, పైగా తప్పకుండా కొనాలన్న నిబంధనలు, షరతులు లేవు. వివిధ రాష్ట్రాలతోపాటు మన దగ్గర హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో అందుబాటులో ఉన్న ‘ఇందిరా ట్రంక్‌’ వాళ్లు ఇంటికే డ్రెస్సులు తీసుకుని వస్తారు.

ఇంటి ముందుకే ‘ఫ్యాషన్‌ ట్రక్స్‌’ :ఈ దుకాణంపేరుతో ఉన్న వెబ్‌సైట్‌, సోషల్‌మీడియా పేజీల్లోని వివరాల్ని అనుసరించి ట్రంక్‌ని బుక్‌ చేసుకుంటే- మనం చెప్పిన సైజులతో రకరకాల డ్రెస్సుల్ని బాక్స్​ల్లో పెట్టి మన ఇంటికి నేరుగా పంపుతారు. రెండుమూడు గంటలపాటు మన వద్దే ఉంచేసి వెళ్తారు. ఇంట్లో వాటిని ట్రై చేసి సరిపోతే కొనుక్కోవచ్చు. ‘అరె ఇంటి వరకూ తెప్పించుకున్నాం కొని తీరాలేమో’ అన్న డౌట్​ పడాల్సిందేమీ లేదు, అవసరమైతేనే వాటిని తీసుకోవచ్చు.

ఇంకా తమిళనాడులోని చెన్నైలో ‘బొటిక్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో షాపింగ్‌ వ్యాన్‌ ఇంటి దగ్గరికే వస్తుంది. ఎంచక్కా అందులోకి వెళ్లి మనకు కావాల్సినవి కొనుగోలు చేయవచ్చు. బెంగళూరు, పుణెలాంటి సిటీల్లోనూ రకరకాల దుస్తులతో ఇంటి ముందుకే ‘ఫ్యాషన్‌ ట్రక్స్‌’ వస్తున్నాయి! ఏది ఏమైనా, నలుగురు స్నేహితులు కలిసి చిన్న పార్టీ ప్లాన్‌ చేసుకుని సరదాగా ఇంట్లోనే గోల్డ్​, బట్టలు కొనాలనుకుంటే- మన దగ్గర అందుబాటులో ఉన్న ఈ ట్రై అండ్‌ బై షాపింగ్‌ని ట్రై చేసి చూడొచ్చు.. ఇంట్లోనే ఉన్నట్టూ ఉంటుందీ, షాపింగూ అవుతుందీ!

పండుగ సీజన్​లో కొనుగోలు చేస్తున్నారా - ఐతే ఇవి మీ కోసమే!

దీపావళి షాపింగ్ చేయాలా? ఈ 6 స్మార్ట్‌ టిప్స్‌తో - బోలెడు డబ్బులు ఆదా చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details