Bird Flu Cases in West Godavari District: కోళ్లకు వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా కోడి మాంసం, గుడ్లను వినియోగించవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అయితే వాటిని బాగా ఉడికించి తినాలని తెలిపారు. అలాగే వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని తెలిపారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జి.కృష్ణ నందం పౌల్ట్రీస్ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోళ్ల షెడ్స్‌లో ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోళ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. కోళ్లు పూడ్చివేత, యాంటీవైరల్ డ్రగ్స్ వినియోగంపై ఆరా తీశారు.
కోళ్లను చంపి గుంతలో పూడ్చివేత: వేల్పూరు కృష్ణనందం పౌల్ట్రీస్‌లో వున్న 5 షెడ్లలో వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత పక్రియ ఆర్.ఆర్.టీ బృందాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదిను కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియకు పశు వైద్యులతో కూడిన 22 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వైరస్ సోకిన కోళ్లను చంపి తవ్విన గుంతలో ఒక లేయర్ కోళ్లు, ఒక లేయర్ లైమ్ ఇలా లేయర్ బై లేయర్ వేస్తూ పూర్తి శాస్త్రీయ పద్ధతిలో సోడియం క్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ వేసి కోళ్లు పూడ్చివేత చేపట్టడం జరిగిందన్నారు. పౌల్ట్రీలో సుమారు 20 వేల కోళ్లు వరకు ఉన్నాయన్నారు. అలాగే మనుషులకు వైరస్ సోకిందన్న వార్తల్లో నిజం లేదని, ఇటువంటి లక్షణాలు ఎక్కడ నమోదు కాలేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
ఆ కోళ్ల ఫారాలను తాళాలు: అలాగే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో జిల్లా అధికార యంత్రాంగం వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యగా స్థానికంగా ఉన్న పాఠశాలలను రెండు రోజుల పాటు అధికారులు మూసివేయించారు. అలాగే గ్రామంలో పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పౌల్ట్రీ ఫాంను సందర్శించి అక్కడ పనిచేసే కార్మికుల నుంచి వైరస్ లక్షణాలపై ఆరా తీశారు.