Wearing a Helmet Does Not Cause Hair Loss :ద్విచక్ర వాహనాలు నడిపే వారు కచ్చితంగా శిరస్త్రాణం(Helmet) ధరించాల్సిందే. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఈ హెల్మెట్నే శ్రీరామరక్ష. కానీ చాలా మంది బైక్ నడుపుతున్నప్పుడు శిరస్త్రాణం ధరించడానికి అసలు ఇష్టపడరు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కేసులు రాసి.. చలాన్లు విధిస్తున్న వారి తీరు మాత్రం మారడం లేదు. పట్టుబడిన వాహన చోదకులు చెప్పే మాటలు వింటే భలే నవ్వు వస్తుంది."హెల్మెట్ ధరిస్తే వెంట్రుకలు ఊడిపోతున్నాయి సర్, జుట్టు చెదిరిపోతుంది, తలనొప్పి వస్తుంది, నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నా సర్ అందుకే పెట్టుకోవడం లేదని" చెబుతారు.దీనిపై డాక్టర్లు మాత్రం మరో విధంగా చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని డెర్మాటలజిస్టులు అంటున్నారు. ఇదే కారణంతో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పుంటున్నారు. హెల్మెట్ ధరించక ప్రాణాలు కోల్పోతుండగా మరి కొందరు జీవచ్ఛవాలుగా మారుతున్నారు.
హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలు :
- గతేడాది మూడు కమిషరేట్ల పరిదిలో 57.51 లక్షల మందికి హెల్మెట్‌లేని కారణంగా చలానాలు చెల్లించారు.
- ఒక్క సైబరబాద్ కమిషనరేట్ పరిధిలో 2024లో 542 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. కాగా ఇందులో 465 మంది ద్విచక్ర వాహనదారులే. చాలావరకు తలకు గాయమై మరణించినవారే.
- సాధారణంగా తలకు గాయమైనప్పుడు కొన్ని క్షణాల పాటు తలనొప్పి, అయోమయం, స్పృహ కోల్పోవడం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, చెవిలో హోరున శబ్దం, దృష్టి మసకబారడం, రుచి తెలియకపోవడం, నిద్రవేళల్లో, ప్రవర్తనలో మార్పులు, బాగా అలసటగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి కేంద్రీకరణలో మార్పులు, జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపిస్తాయి.
- ప్రమాదం జరిగినప్పుడు తల తీవ్రంగా అదురుతుంది. లోపల తీవ్ర గాయమవుతుంది. పుర్రె గోడలకు మెదడు కొట్టుకుంటుంది. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని తీవ్రమైన రక్తస్రావానికి దారితీస్తుంది. హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రమైన గాయాల తీవ్రత తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- హెల్మెట్ ధరించడం అంటే కొందరు కేవలం పైన తలకు తగిలించుకుంటారు. కానీ మెడ కింద బెల్టు సక్రమంగా లేకపోతే ప్రమాద సమయంలో హెల్మెట్ పక్కకు ఎగిరిపోయి తలకు గాయాలయ్యే అవకాశముంది. మంచి కంపెనీతో పాటు ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్లు ధరించడం శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు.
హెల్మెట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి :
- నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదు. ప్రభుత్వం ప్రమాణాలకు తగినవి ఎంచుకోవాలి.
- కూల్ ఫైబర్ ఉన్న హెల్మెట్లు, గాలి లోపలకు వెళ్లే వాటిని ఎంచుకుంటే ఎలాంటి చెమట పడ్డదు
- తల సైజుకు తగ్గట్లు హెల్మెట్‌ను ఎంపిక చేసుకోవాలి.
- చుండ్రు, చర్మ వ్యాధులు ఏవైనా ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.