Waterfalls Overflowing in Tirumala Seshachalam Forest :తిరుమలగిరులు సరికొత్త శోభ సంతరించుకొన్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు పాల ధారల్లా తెల్లని నురుగుతో కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది.
ఏడుకొండల్లో పరచుకొన్న పచ్చదనం ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. తిరుమలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున టీటీడీ ప్రత్యేక నిఘా పెట్టింది. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.
తిరుమలలో భారీ వర్షం - ఆ దారులు మూసివేత
తిరుపతి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు అధికారులు సెలవు ప్రకటించారు.
వర్షాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ పలు జాగ్రత్తలు చేపట్టింది. కొండ చరియలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గోగర్భం, పాపవినాశనం జలాశయాలు పూర్తిస్ధాయి నీటి మట్టానికి చేరాయి. ఎగువ కురిసిన వర్షాలతో ఒకటో కనుమరహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం పొంగిపోర్లుతోంది.