Water Heater Precautions : నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుత్తు ప్రమాదాల కారణంగా మరణిస్తూనే ఉన్నారు. ఇంట్లో వాడే కరెంటు పరికరాలపై అవగాహన లేక విద్యాదాఘాతానికి గురవుతున్నారు. వేడి నీటి కోసం హీటర్‌ను వాడుతుంటారు. వీటిని కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యుదాఘాతానికి గురవుతున్నారు.
చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. గతంలో వేడి నీళ్లతో స్నానం చేయాలంటే కట్టెల పొయ్యి మీద వేడి చేసుకొని చేసే వాళ్లం. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి రావడంతో కట్టెల పొయ్యి కనిపించకుండా పోయాయి. ఈ రోజుల్లో చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్లు ఉపయోగిస్తుంటారు.
వీటిని కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యుదాఘాతానికి గురవుతున్నారు. వీటిని వినియోగించేటప్పుడు విద్యుత్తు ప్రసారం జరిగే ఇనుము బకెట్లో కాకుండా ప్లాస్టిక్ బకెట్‌లో నీటిని వేడిచేయాలి. హీటర్‌ను వినియోగించేటప్పుడు నీటిలోకి ఎంత మేర ఉంచాలో దానిపై గుర్తు ఉంటుంది. బకెట్‌లో హీటర్ ఉంచే సమయంలో కర్రను వాడాలి. నాణ్యత లేని హీటర్లను ఉపయోగించవద్దు. వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. పాత వాటర్ హీటర్ రాడ్లను ఉపయోగించొద్దు. హీటర్‌కు లవణాలు పట్టుకొని ఉంటాయి. వారానికోసారి హీటర్‌ను శుభ్రం చేస్తే త్వరగా నీరు వేడవుతుంది. ఎక్కువ సేపు నీటిలో హీటర్‌ను ఉంచవద్దు.