Special Story On Deepthi Jeevanji :తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే గానీ ఇళ్లు గడవని కుటుంబ నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికంతో అంతంత మాత్రమే ఉన్న ఆర్థిక పరిస్థితి. మరోవైపు మానసిక లోపం సమస్య! ఆమె పడని ఇబ్బంది లేదు. ఎదుర్కోని అవమానం లేదు. ఇన్ని సమస్యల్లోనూ ఆమె ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇంటిని, ఊరిని విడిచిపెట్టి సరికొత్త మార్గంలో పయనించింది. అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదలే ఆయుధాలుగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అథ్లెటిక్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ఆ అమ్మాయే జీవాంజి దీప్తి.
ఇదీ దీప్తి విజయ ప్రస్థానం :దీప్తిది వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మిని కుమార్తెకు ఎదురయ్యే అవమానాలు మానసికంగా మరింత కుంగదీసేవి. అయితే భారత జూనియర్ జట్టు చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ దృష్టిలో పడటం దీప్తి కెరీర్ మరో మలుపు తిరిగింది. వరంగల్‌లో పాఠశాల మీట్‌లో దీప్తిని చూసిన ఆయన శిక్షణ కోసం హైదరాబాద్‌కు పంపించమని దీప్తి తల్లిదండ్రులకు సూచించాడు.
బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తానే భరించి ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చి మంచి శిక్షణ ఇప్పించాడు. ఈ క్రమంలోనే ‘లక్ష్య’ మార్గనిర్దేశకుడు పుల్లెల గోపీచంద్ చొరవతో ఆమె మానసికలోపమున్న అథ్లెట్ల పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీల్లో బరిలో దిగేందుకు అవసరమైన అనుమతుల కోసం మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం పుల్లెల గోపీచంద్ రూ.3 లక్షలు వెచ్చించి దీప్తి భవితకు బాటలు వేశాడు.
మొరాకో నుంచి కోబె వరకు :ఆర్థికంగా కొంత మద్దతు, అత్యున్నతమైన శిక్షణ లభించడంతో దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో ఆమె టీ20, 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. దీప్తికి ప్రతిభకు దక్కిన తొలి అంతర్జాతీయ స్వర్ణమిదే. 400తో పాటు 200 మీటర్లలోనూ తన సత్తా చాటింది. అదే ఏడాది బ్రిస్బేన్ వేదికగా వర్చుస్ ఆసియానియా పోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచిన ఆమె 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.