NampallyNumaish Exhibition 2025 :హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వరుస సెలవులు రావడంతో రోజుకు 60 వేల మంది వరకు సందర్శకులు వస్తున్నారు. నచ్చిన వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు, తినుబండారాలు కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల భద్రత కోసం పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు సహా బాంబు స్క్వాడ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.
ఆకట్టుకుంటోన్న నుమాయిష్ : అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. దేశంలోనే పేరున్న రకరకాల చీరలు, చుడీదార్‌లు, గృహోపకరణాలు, డ్రైఫ్రూట్స్ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆట వస్తువులు, ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ప్లేజోన్ ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల స్టాళ్లు నుమాయిష్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈనెల 3న ప్రారంభమైన 84వ ఎగ్జిబిషన్‌లో దాదాపు 2వేల స్టాళ్లు ఏర్పాటు చేశారు. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు భారీగా వస్తున్నారు.
భారీగా తరలివస్తున్న జనం :శనివారం నుంచి వరసగా సెలవులు కావడంతో మూడు రోజుల నుంచి రోజూ సుమారు 50వేల మందికిపైగా నుమాయిష్‌కు వస్తున్నారు. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, దిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌తోపాటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నుమాయిష్‌లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రకాల దుస్తులు, చీరలు మగువలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రకరకాల తినుబండారాలు, జ్యూస్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. రుచికరమైన చిరుతిళ్లను సందర్శకులు ఎంతగానో ఇష్టపడి తింటున్నారు. కేరళ, తమిళనాడు వంటకాలు నోరూరురిస్తున్నాయి.