Heavy Rain Alert for South Coast Areas :దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీంతో మరో ఆరు గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతవరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. నైరుతి బంగాళాఖతంలో తీవ్ర వాయుగుండం ఇవాళ ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీంతో రాగాల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాగల రెండ్రోజుల పాటు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ వాతవరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వివరించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల ఈనెల 28, 29న మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.
ఏపీ పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ :మరోవైపు ఈ ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 48 గంటల్లో ఆయా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఏపీలో అన్ని పోర్టుల్లో అధికారులు ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు.