విజయవాడ ఎన్టీటీపీఎస్ కాలుష్యం - చెట్లు, పశువులపైనా కమ్మేస్తున్న బూడిద Vijayawada NTTPS Pollution: విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటైన థర్మల్ విద్యుత్ కేంద్రం (Narla Tatarao Thermal Power Station) నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తోంది. బొగ్గును వినియోగిస్తూ విద్యుత్‌ను తయారుచేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తం 2 వేల 560 మెగావాట్ల తయారీ సామర్థ్యంతో నిరంతరాయంగా పనిచేస్తూ వెలుగులు పంచుతోంది. పని తీరులో దేశ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ పవర్ స్టేషన్ కాలుష్యం వెదజల్లడంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటుంది.
ముఖ్యంగా కొండపల్లి మున్సిపాల్టీ, ఇబ్రహీంపట్నంతో పాటు సుమారుగా 10 గ్రామాల్లో కాలుష్యం భయాందోళనలు రేకెత్తిస్తోంది. థర్మల్ స్టేషన్ నుంచి వెలువడే పొగ, బూడిద వల్ల వాయు, జల కాలుష్యం ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. రోజుకు 2 వేల లారీల ద్వారా బూడిద తరలింపు జరపడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరిందని వాపోతున్నారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ విద్యుత్ కేంద్రం ఆధునీకరణకు నోచుకోకపోవడం వల్ల రెట్టింపు కాలుష్యానికి గురవుతున్నారు. చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోపాటు దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఎన్టీటీపీఎస్‌పై చర్యలు తీసుకోండి- సీఎం జగన్‌కు విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ
పరిశ్రమ నుంచి బూడిద తమ ఇళ్లు, పరిసరాలపైన పడుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇళ్లలో పడిన బూడిదను ఎప్పటికప్పుడు బయటకు తొలగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగేనీరు, పీల్చేగాలి కలుషితమవుతున్న నేపథ్యంలో వీటీపీఎస్‌కు ఆనాడు స్థలాలు, పొలాలు ఎందుకోసం ఇచ్చామని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ భూమి, నీటిని వాడుకుంటున్నప్పుడు పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టే కనీస బాధ్యత పవర్ స్టేషన్ యాజమాన్యానికి లేదా అని వారు నిలదీస్తున్నారు. 30 సంవత్సరాలు పైబడిన తొలి నాలుగు థర్మల్ తయారీ యూనిట్లను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీటీపీఎస్ ప్రభావిత గ్రామాల్లో 70 శాతం మేర చెట్లను పెంచి వాయు కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతున్నారు.
పరిశ్రమల కోసం భూములిచ్చాం.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తున్నాం..!
కాలుష్య నివారణకు వీటీపీఎస్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీటీపీఎస్ (Vijayawada Thermal Power Station) కాలుష్య వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన తొలి 4 థర్మల్ తయారీ యూనిట్లను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల ప్రమాదం లేకుండా డీనాక్స్ యూనిట్ పెట్టాలని చెప్పినా వీటీపీఎస్ పట్టించుకోవడం లేదని విశ్రాంత శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
"ఈ ఎన్టీటీపీఎస్ నుంచి గత కొంతకాలంగా చాలా దారుణమైన కాలుష్యాన్ని బయటకు వదులుతున్నారు. దాని వలన పర్యావరణం మొత్తం నాశనం అయిపోయింది. పిల్లలకి చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. యువకులకు, మహిళలకు సైతం అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ వీటిని ప్రభుత్వ ఆసుపత్రులతో నోట్ చేయడం లేదు" - సురేష్ కుమార్, కొండపల్లి
కోట్ల విలువైన థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిద దోపిడిపై టీడీపీ నేతల ఆగ్రహం