ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రింటింగ్ సెక్టార్​పై పిడుగు- నీటిలో నానుతున్న కోట్లాది రూపాయల పుస్తకాలు, పేపర్ బండిళ్లు - Floods Effect on Printing Sector - FLOODS EFFECT ON PRINTING SECTOR

Vijayawada Floods Effect on Printing Sector: ముద్రణ రంగానికి పెట్టింది పేరు విజయవాడ. ప్రింటింగ్ ప్రెస్సులకు హబ్​గా ఉన్న విజయవాడ, వరదల దెబ్బకు అతలాకుతలమైంది. ఏడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ రంగానికి వరదలు భారీ నష్టాలను మిగిల్చాయి. విజయవాడ శివారులోని సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాశ్ నగర్, కండ్రిక, రాజరాజేశ్వరిపేటలో అత్యధికంగా ఉండే ప్రింటింగ్ ప్రెస్​లు తీవ్రంగా నష్టపోయాయి.

Vijayawada Floods Effect on Printing Sector
Vijayawada Floods Effect on Printing Sector (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 7:41 PM IST


Vijayawada Floods Effect on Printing Sector:విజయవాడలో వరదలు ముద్రణా రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కోట్లాది రూపాయల పుస్తకాలు, పేపర్ బండిళ్లు నీటమునిగాయి. సరకును తీసుకోవడానికి కూడా వీల్లేకుండా వరదలు ముంచెత్తాయని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు లబోదిబోమంటున్నారు. పుస్తకాలు నీటిలో నానిపోయి ఎందుకూ పనిరాకుండా పోయాయి.

ఆంధ్రప్రదేశ్​లో 80 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్​లు, ఇతర మెటీరియల్, పట్టాదారు పాస్ పుస్తకాలు, హెల్త్, బీమా కార్డులు, రేషన్ కార్డులు ముద్రించే కీలకమైన 18 ప్రింటింగ్ ప్రెస్​ల్లోకి 3 నుంచి 4 అడుగుల మేర వరదనీరు చేరింది. విద్య సంబంధిత మెటీరియల్ తయారు చేసే విక్రం, వీజీఎస్, రాఘవేంద్ర వంటి పబ్లిషర్స్ కూడా తీవ్రంగా నష్టపోయాయి. మొత్తం 450 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా.

50 కోట్ల మేర యంత్రాలు, మరో 250 కోట్ల విలువైన పుస్తకాలు, ఇంకో 150 కోట్ల విలువైన పేపర్ బండిళ్లు నీటిలో మునిగి పాడయ్యాయి. ముద్రణ రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు 7 వేల మంది రోడ్డున పడ్డారు. ప్రభుత్వం తగిన రీతిలో అదుకుంటే తప్ప సంస్థల పునరుద్ధరణ కష్టమని నిర్వాహకులు చెబుతున్నారు. ముద్రణ సంస్థల్లో ఇప్పటికీ వరద నీరు చేరి ఉంది. ప్రభుత్వ ఆర్డర్లపై ముద్రించిన అనేక పాఠ్యపుస్తకాలు నీటిలో తేలుతున్నాయి. ముద్రణ యంత్రాలు మునిగే ఉన్నాయి.

మున్నేరులో కన్నీటి ప్రవాహం- వరదలో కొట్టుకుపోయిన 'వివాహ' సంతోషాలు - Massive Loss by Floods in Khammam

వరద నీటి ఉద్ధృతితో మూడు, నాలుగు రోజుల వరకు ప్రెస్ వద్దకు నిర్వాహకులు చేరుకోలేకపోయారు. ఆ తరువాత అతి కష్టం మీద వెళ్లినా అప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. గంట వ్యవధిలో కళ్ల ముందే ప్రెస్ లోపలికి పది అడుగుల మేర వరద నీరు చేరిందని, ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయామన్నారు. ఇంతటి భారీ విపత్తు ఎప్పుడూ చూడలేదని, కొన్ని నెలలపాటు ప్రెస్​లను పునరుద్ధరించే అవకాశం కనిపించట్లేదని వాపోయారు. అప్పటివరకు జీవనోపాధి కోల్పోయినట్లేనని ప్రింటింగ్ సంస్థ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.

విజయవాడలోని ఆటోనగర్, గాంధీనగర్, వన్ టౌన్ ప్రాంతాల్లోని ప్రింటింగ్ ప్రెస్​లపై వరద ప్రభావం కొంత మేర ఉన్నా, సింగ్ నగర్లో సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రింటింగ్ ప్రెస్లు, పబ్లిషర్స్ ఉంటే వీటిలో 50 వరకు విజయవాడలోనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇక్కడే పాఠ్య పుస్తకాలు ముద్రించి పంపిణీ చేసేవారు.

విభజన తరువాత ఏపీ వ్యాప్తంగా ఇక్కడి నుంచే పాఠ్య పుస్తకాలు, ప్రశ్నపత్రాలు ముద్రించి అందిస్తున్నారు. వరదల దెబ్బకు పుస్తకాలు, పేపర్ బండిళ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. లోపలకి అడుగుపెట్టేందుకే వీలులేకుండా పరిస్థితి మారిపోయింది. ఇన్నేళ్ల వ్యాపార జీవితంలో ఎప్పుడూ ఇలాంటి విపత్తు ఎదుర్కోలేదని నిర్వాహకులు వాపోతున్నారు.

వరదతో తీవ్రంగా నష్టపోయిన ముద్రణ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. కొత్త యంత్రాలు కొనేందుకు రాయితీలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్తు ఛార్జీల రద్దు, రుణాల రీషెడ్యూలింగ్, బ్యాంకు రుణాలపై ఆరు నెలలపాటు మారటోరియం విధించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏపీకి 6,880 కోట్లు ఇవ్వండి - కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం మధ్యంతర నివేదిక - AP Floods Damage Report

ABOUT THE AUTHOR

...view details