Bus overturned on Gaman Bridge : వారంతా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సెక్కారు. వారి ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్నారు. కానీ ఇంతలోనే భారీ కుదుపు. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఊహించని ప్రమాదం వారిని షాక్‌కి గురిచేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాజమహేంద్రవరం గామన్ వంతెన అనుసంధాన రహదారి కాతేరు-కొంతమూరు మధ్య ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు బాధితులు విలవిల్లాడారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Road Accident in Rajamahendravaram : తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెండు క్రేన్లతో బస్సును పైకి లేపారు. క్షతగాత్రుల్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా నడపటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతురాలు విశాఖకు చెందిన హోమిని కల్యాణిగా గుర్తించినట్లు తెలిపారు. ఆమె హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్తుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్‌మార్టం నిమత్తం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాదంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
అపసవ్య దిశలో మళ్లించడంతో : కొంతమూరు వద్ద వంతెనపై మరమ్మతులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ దీనిని గుర్తించక అపసవ్య దిశలోకి ఒక్కసారిగా మళ్లించడం, అదే సమయంలో ఎదురుగా ఓ ద్విచక్రవాహనం వస్తుండటంతో తప్పించే క్రమంలో బోల్తాపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు ఇంకొంచెం ముందుకు వెళ్లాక అదుపు తప్పిఉంటే గోదావరి నదిలో పడిపోయే పరిస్థితి ఉండేదని సమాచారం.