Vijayawada Railway Station Bagged 'Eat Right Station' Certification : దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన విజయవాడ రైల్వే స్టేషన్ మరో గుర్తింపు సాధించింది. ప్రయాణికులకు నాణ్యమైన, శుచికరమైన ఆహారం అందించే స్టేషన్‌గా ఈట్ రైట్ స్టేషన్ ధ్రువపత్రం పొందింది. పరిసరాల పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందజేశారు.
బెజవాడ పేరు చెబితేనే భోజన ప్రియులకు నోటిలో నీళ్లు ఊరతాయి. రుచికి, శుచికి పెట్టింది పేరైన విజయవాడలో ఆహారపదార్థాలను చూస్తే ఆవురావురమంటూ ఆరగించాల్సిందే. దక్షిణ భారతంలోనే అతి పెద్ద జంక్షన్లలోని విజయవాడ రైల్వే జంక్షన్ ఒకటి. ప్రతిరోజూ లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన 300 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంటాయి.
లక్షలాది మంది ప్రయాణికులు నాణ్యమైన, రుచికరమైన ఆహారపదార్థాలు అందించేందుు వీలుగా స్టేషన్లో రెస్టారెంట్లు, క్యాంటీన్లు, హోటళ్లు, చిరుతిళ్ల దుకాణాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. వీటిని టెండర్ల ద్వారా ప్రవేట్ వ్యక్తులకు అప్పగించారు. నిరంతరం స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార తయారీ ప్రక్రియను తనిఖీలు చేస్తూ, పర్యవేక్షిస్తూ లోపాలను సరిదిద్దుతున్నారు. తద్వారా స్టేషన్‌లో రైలు దిగే ప్రయాణికులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
వారు రైలు ఎక్కేందుకు క్యూ పద్ధతి - విజయవాడ రైల్వేస్టేషన్లో అమలు
ప్రయాణికులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని, సేవలను అందించే రైల్వేస్టేషన్లను గుర్తించి ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ ఏటా ప్రతిష్టాత్మక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తనిఖీలు నిర్వహిస్తుంది. లోపాలు సరిదిద్ది, నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించేలా ఆయా స్టేషన్లకు ఈట్ రైట్ స్టేషన్ అనే ధ్రువీకరణపత్రం జారీ చేసి ప్రోత్సహిస్తోంది. ఆరు నెలల క్రితం ప్రీ ఆడిట్‌లో భాగంగా సిబ్బంది విజయవాడ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసి లోపాలను సరిదిద్దారు.
స్టేషన్లో ఆహారం తయారీదారులు అత్యుత్తమ విధానాలు పాటించేలా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు, విక్రయదారుల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఆహార నిల్వ కోసం ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అంశాల్లో పాటించాల్సిన విధానాలపై ఆహార తయారీ దారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తద్వారా ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు చేపట్టారు.ఆ తర్వాత ఆరునెలల పాటు వివిధస్థాయిలో అధికారులు హోటళ్లు, స్టాళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
'థర్డ్ పార్టీ తనిఖీల్లోనూ స్టేషన్లలో ఆహార కేంద్రాల ద్వారా అందుతోన్న ఆహార నాణ్యత, పోషక విలువలు, పరిశుభ్రత అంశాలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. తనిఖీల్లో 85 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు అందుకుంది. రైలు ప్రయాణికులకు నాణ్యతతో కూడిన పోషకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు గుర్తించిన FSSAI (Food Safety and Standards Authority of India) బెజవాడ స్టేషన్‌కు 5 స్టార్ ‘ఈట్ రైట్ స్టేషన్ ’ సర్టిఫికేషన్ మంజూరు చేసింది.' -సౌరిబాల, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ రైల్వే ఆస్పత్రి
దక్షిమ మధ్య రైల్వేలో ఇప్పటి వరకు కేవలం నాలుగు స్టేషన్లు మాత్రమే ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, గుంటూరు, నడికుడి, అన్నవరం స్టేషన్లు ఈ ధ్రువపత్రాన్ని పొందాయి. డివిజన్‌లోని అధికారుల కృషి, పర్యవేక్షణ వల్లే నాణ్యమైన, శుచికరమైన ఆహారం లభించే స్టేషన్‌గా విజయవాడ స్టేషన్ గుర్తింపు సాధించిందని ఈ గుర్తింపును నిరంతరం కొనసాగించేలా భవిష్యత్తులోనూ తగిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎం తెలిపారు.
లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చండతోపాటు అధిక ఆదాయం ఆర్జనలో ముందువరసలో ఉండే బెజవాడ రైల్వేస్టేషన్ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ఈట్‌రైట్ అవార్డు కైవసం చేసుకోవడం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత - ఎన్‌ఎస్‌జీ1గా గుర్తింపు - NSG 1 designation for Vijayawada