Tirupati Stampede Judicial Inquiry: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ముగిసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తితో పాటు పలువురు సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తిరుపతి కలెక్టరేట్లో విచారణ జరిపింది. టీటీడీ ఈవో శ్యామలరావు, పలువురు పోలీస్ అధికారులను కమిటీ విచారించింది.
జ్యుడీషియల్ ఎంక్వయిరీలో భాగంగా మూడు రోజులుగా తిరుపతిలో కమిటీ పర్యటించింది. నగరంలోని తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను శనివారం పరిశీలించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుంది. ఎనిమిది ప్రాంతాల్లో ఏకాదశి టికెట్లు మంజూరు చేసిన విధానంపై ఆరా తీసింది. విచారణ నేపథ్యంలో కమిటీ పలు దస్త్రాలను సేకరించింది. త్వరలోనే ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందజేయనుంది.