Vijayadashami Celebrations 2024 :రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ఆనందోత్సవాల నడుమ దసరా వేడుకలు చేసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ, వాహనాలకు పూజలు చేసుకున్నారు. ఒకరికొకరు జమ్మీ ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయ ఆలింగానాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుయజేసుకున్నారు. పలు ప్రాంతాల్లో రావణాసురుని దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు.
వరంగల్‌లో విజయదశమి వేడుకలు :విజయదశమి పర్వదినం పురస్కరించుకుని వరంగల్ భద్రకాళీ ఆలయంలో అమ్మవారు నిజరూపంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా భద్రకాళీ తటాకంలో నిర్వహించిన అమ్మవారి తెప్పోత్సవం ఆద్యంతం కనులపండువగా సాగింది. మంత్రి కొండా సురేఖ ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఉర్సు రంగలీల మైదానంలో ఏర్పాటు చేసిన రావణ వధకు సురేఖ హాజరయ్యారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జమ్మిచెట్టుకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గ్రామస్థులు శమీ పూజను నిర్వహించారు. అనంతరం రావణాసురుని భారీ ప్రతిమను దహనం చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని రావణాసుర వధ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్‌లోని హనుమంతుని గడ్డలో ఏర్పాటు చేసిన భారీ రావణాసురుని ప్రతిమకు ఎమ్మెల్యే మురళీ నాయక్ నిప్పంటించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై రావణదహనాన్ని వీక్షించారు.
సిద్దిపేట జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు :సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సాపూర్‌లో శక్తి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని రావణ దహనం చేశారు. పోతారంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ పాల్గొని శమీ వృక్షానికి పూజలు చేశారు. మిరుదొడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గ్రామస్థులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన దసరా ముగింపు ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాటలు పాడి ప్రజలను ఉర్రూతలూగించారు.
జహీరాబాద్‌లోని కైలాసగిరి శివాలయం ఆవరణలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో రావణాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో దసరా వేడుకలు ఆనందోత్సహాల మధ్య జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజలందరూ జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయ అలింగనాలతో శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
రామ్‌లీల కార్యక్రమంలో మంత్రి పొన్నం :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన రామ్ లీలా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు వివిధ దేవాలయాల్లో, దుర్గా దేవి మండపాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని పురాతన చెన్నకేశవస్వామి ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చెన్నకేశవ స్వామి రథాన్ని ప్రారంభించారు. జగిత్యాలలోని జంబిగద్దె వద్ద నిర్వహించిన వేడుకల్లో జగిత్యాల అదనపు కలెక్టర్ రాంబాబు ఆయుధ పూజలో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జంబిగద్దె ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది.