NDSA Experts Committee on Kaleshwaram Project :మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు. ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, ఇన్వెస్టిగేషన్స్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై వివిధ విభాగాల ఇంజినీర్లతో మూడు రోజుల పాటు కమిటీ సమావేశమైంది. ఆయా అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకొంది. అదనపు సమాచారాన్ని కూడా సేకరించింది. ఆనకట్టలు నిర్మించిన నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమై అన్ని వివరాలు ఆరా తీసింది.
NDSA Committee On Medigadda Damage :ఇవాళ ఉదయం రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతోనూ అయ్యర్ కమిటీ సమావేశమైంది. మేడిగడ్డలో పియర్స్ కుంగిన, అన్నారంలో సీపేజీ వచ్చిన తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకున్న చర్యలతో పాటు మరమ్మత్తులు, తదుపరి కార్యాచరణపై కమిటీ చర్చించింది. విజిలెన్స్ విభాగం డీజీ రాజీవ్ రతన్, అధికారులతోనూ కమిటీ సమావేశమైంది. మేడిగడ్డ ఆనకట్ట వ్యవహారంపై విజిలెన్స్ విభాగం ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీంతో అందుకు సంబంధించిన అంశాలపై కమిటీ చర్చించింది. తమ విచారణలో గుర్తించిన కొన్ని అంశాలను రాజీవ్ రతన్ కమిటీకి వివరించారు.
Medigadda Barrage issue :సమావేశం తర్వాత రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబరేటరీలో ఉన్న మేడిగడ్డ సహా ఇతర ఆనకట్టల నమూనాలను చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ పరిశీలించింది. మూడు గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్న కమిటీ దాదాపు మూడు గంటల పాటు నమూనాను పరిశీలించింది. అందులోని సాంకేతిక అంశాలను క్షుణ్నంగా తెలుసుకున్నారు. అంచనాలు, సామర్థ్యం, నిల్వ, ప్రవాహాలకు సంబంధించిన అంశాలను ఆరా తీశారు. గేట్లు అయిదు ఇంచులపైకి ఎత్తి ప్రవాహవేగం, పనితీరును పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు వారికి అన్ని అంశాలు వివరించారు. భూసార పరీక్ష నిర్వహించిన ఇంజినీర్లతోనూ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ చర్చించి అన్ని అంశాలను ఆరా తీసింది. అనంతరం రాష్ట్ర పర్యటన ముగించుకొని కమిటీ దిల్లీ బయల్దేరి వెళ్లింది.