Jubilee Hills Multipurpose Mega Complex Construction :హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని భవన నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపింది. నందగిరి హిల్స్‌లో 4.78 ఎకరాలు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని రెండు ప్లాట్లకు సంబంధించిన 865.42 చదరపు గజాలు కలిపి నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ చేపట్టిన మల్టీపర్పస్ మెగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ప్రకారం ముందు అనుమతులు మంజూరు చేసిన అధికారులను, పర్యవేక్షణకు సంబంధించిన అధికారులను విచారించింది. అనంతరం డాక్యుమెంట్లను పరిశీలించి బాధ్యులైన అధికారులపై చర్యకు సిఫార్సు చేసింది.
విజిలెన్స్ నివేదికలోని ముఖ్యాంశాలు :
- హెచ్ఎండీఏ భూమిని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ లేఔట్లో చూపారు.
- నెట్ నెట్ వెంచర్స్‌కు లబ్ధి కలిగించడానికి, ఎత్తుపై సడలింపు ఇవ్వడానికి, టీడీఆర్(ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంటల్ రైట్స్)కోసం ఇలా చేశారు.
- డాక్యుమెంట్లు, నోట్పైళ్లను పరిశీలించకుండానే ఉన్నతాధికారులు అప్పటికే ఉన్న సెల్లార్ ఫ్లోర్లను స్టిల్ట్ ఫ్లోర్లుగా మారుస్తూ సవరణ అనుమతులు ఇచ్చారు.
- డాక్యుమెంట్లను పరిశీలించకుండానే అప్పటికే నిర్మించిన ఆర్సీసీ శ్లాబుల కింద బేస్మెంట్ ఫ్లోర్, స్టిల్ట్ ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతులు సవరించారు.
- అప్పటికే ఒక్కో శ్లాబ్ నాలుగున్నర మీటర్లతో ఉంటే ఐదు మీటర్లకు ఇచ్చారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన 866 చదరపు గజాలతో కూడిన రెండు ఫ్లాట్లు వేర్వేరు పేర్లతో నమోదు చేశారు. ఆ రికార్డులను పరిశీలించకుండానే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆమోదిత లేఔట్‌కు భిన్నంగా అందుకు తగిన అనుమతులు ఇచ్చింది.
- ఒక ప్లాట్ మాత్రమే నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉండగా, రెండో ప్లాట్ ఆ సంస్థ పేరుతో లేదు. కానీ సవరించిన అనుమతులు ఇచ్చారు.
- 2017 ఫిబ్రవరి 7న ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్-305ను తప్పుగా అన్వయించి ఈ సంస్థకు ప్రయోజనం కల్పించారు’ అని నివేదికలో వివరించింది.
తొలుత జీ+5 తర్వాత జీ+12 : ఆగస్టు 8న రికార్డులను పరిశీలించి డిప్యూటీ సిటీ ప్లానర్ ఏడు సెల్లార్లు, జీ+5 ఫ్లోర్లకు మొదటిసారిగా సవరించి భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. మళ్లీ 2022 ఫిబ్రవరి 17న రెండోసారి అప్పటికే ఉన్న ఆర్సీసీ శ్లాబ్‌ను పరిగణనలోకి తీసుకోకుండానే ఏడు స్టిల్ట్, జీ+12 ఫ్లోర్లకు సిపార్సు చేశారని విజిలెన్స్ నివేదించింది.
అలాగే నందగిరి హిల్స్‌ను తవ్వి అక్కడున్న నేల స్వభావాన్ని వినియోగించుకొని ఏడు సెల్లార్లను ఏడు స్టిల్ట్ ఫ్లర్స్గా మార్చి అనుమతులు తెచ్చుకున్నారని విజిలెన్స్ పేర్కొంది. 2021 మార్చి 2న ఇచ్చిన మరో జీవోను ఉల్లంఘించి టీడీఆర్ ఫ్లోర్లకు అనుమతించారని గమనించారు. నిర్మాణంలో మార్పులున్నా సరే 2021 నవంబరు 3న రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2023 సెప్టెంబరు 26న సవరించిన భవన నిర్మాణానికి అనుమతిచ్చారని వివరించారు.