Vemulawada Talaneelalu Tender Problems : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామికి భక్తులు మొక్కుబడిగా తమ తలనీలాలను సమర్పిస్తారు. వీటిని సేకరించేందుకు ఆలయ అధికారులు టెండర్లు వేస్తారు. కానీ తొమ్మిది నెలలుగా ఈ తలనీలాలను గుత్తేదారు సేకరించకపోవడంతో ఆలయ అధికారులే వీటిని భద్రపరచాల్సిన అవసరం ఏర్పడింది. చాలా నెలలుగా సంచిలో పెట్టి గదిలో ఉంచడంతో వాసన వస్తున్నాయి. దీంతో వాటిని బయటకు తెచ్చి, ఆరబెట్టి మళ్లీ సంచులో వేసి గదిలో వేసి భద్రపరుస్తున్నారు. ఇదంతా అధికారులకు భారంగా మారింది.
గుత్తేదారు రాక ఇబ్బందులు : 2023 మార్చి 31 నుంచి 2025 మార్చి వరకు రెండేళ్ల పాటు భక్తులు సమర్పించే తలనీలాలను కల్యాణ కట్టలో సేకరించుకునేందుకు ఆలయ అధికారులు టెండర్ నిర్వహించారు. దీన్ని ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన సుమిత్ర ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ రూ.19 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ప్రతి నెలా రూ.79 లక్షల చొప్పున చెల్లించాలనే నిబంధన ప్రకారం 2024 మార్చి 31 వరకు రూ.9 కోట్ల మేర చెల్లించారు. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ తగ్గిపోయిందనే కారణంతో గుత్తేదారు ముందుకు రాలేదు. దీంతో డబ్బులు కూడా చెల్లించలేదు. మిగతా రూ. 10 కోట్లు చెల్లించాల్సి ఉంది.
తలనీలాల సేకరణ : పైగా తొమ్మిది నెలల కాలంలో గుత్తేదారు ఇచ్చిన 6 చెక్కుల్లో మూడు చెల్లుబాటు కాని చెక్కులు ఇచ్చారు. దీంతో ఆలయ అధికారులు పోలీస్ కేసులు పెట్టారు. అప్పటి నుంచి తలనీలాల సేకరణ ఆలయ అధికారుల పర్యవేక్షణలో నడుస్తోంది. వాటిని భద్రపరచడం వీరికి తలనొప్పిగా మారింది. చాలా రోజులుగా సంచుల్లో ఉంచడంతో కల్యాణకట్టలో దుర్వాసన వస్తోంది.