Vehicles Traffic at Panthangi Toll Plaza : ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా, ఓటేసేందుకు ఏపీకి వెళుతుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అవుతోంది.
వీకెండ్ కావడం, పోలింగ్‌కు కేవలం రెండు రోజులే సమయం ఉండటంతో నగర జనాభా ఏపీ వైపు పరుగులు తీస్తోంది. దీంతో భారీ రద్దీ నెలకొంది. పలు చోట్ల నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. మూడు రోజులు సెలవు దినం కావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఈ సాయంత్రం నుంచి వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రైవేటు ట్రావెల్స్ 3 రెట్ల ఛార్జీ : ఇదిలా ఉండగా సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్ చేసుకుందామనుకున్నప్పటికీ అప్పటికే బస్సు టికెట్లు బుక్ అయి ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సులు, రైళ్లు వద్దకు చేరుకుంటున్నారు. కూకట్పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు వెళుతున్న వారికి ఎన్నికల కమిషన్ రవాణా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సు టికెట్లు సైతం అధిక ధర తీసుకుంటున్నారు. ప్రైవేటు బస్సులైతే ఏకంగా 3 రెట్లు ఎక్కువగా ఛార్జీని వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.