Vallabhaneni Vamsi Followers Arrested in Krishna District :కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. 2014 జనవరి 21వ తేదీన గన్నవరం పీఏసీఎస్ఓ (PACSO) మాజీ అధ్యక్షుడు, తెలుగుదేశం నేత కాసనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేశారు.
గన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పార్క్ ఎలైట్ హోటల్ వద్ద పొలం విషయమై మాట్లాడేందుకు రంగబాబును పిలిచి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తనపై దాడికి పాల్పడింది వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు. వంశీ అనచురుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నీరుగార్చింది. ఇప్పటికి కేసులో కదలిక వచ్చింది. గన్నవరం పోలీసు స్టేషన్‌లో గత ఏడాది క్రైంనెంబరు 42గా ఈ దాడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు.