Valentines Day 2024 :ప్రేమ ఎన్నో భావోద్వేగాల కలయిక. రెండు క్షణాలతో అంతమయ్యేది అంతకన్నా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ బంధమూలేని తొలి సంబంధమే ప్రేమ. అది ఒక అనిర్వచనీయ అనుభూతి. ప్రేమను నిజంగా మనసుపెట్టి చూడగలిగితే, మనస్పూర్తిగా ఆస్వాదించగలిగితే ఆది, అంతం లేని అమరానందమే. రెండు హృదయాల్లో సెలయేటిలా పారుతుంది. అలసట తీర్చే చిరుగాలిలా మారుతుంది.
ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్నపుడు ప్రేమే జీవరాగమవుతుంది. ఆ ప్రేమే జ్ఞానయోగమూ అవుతుంది. అలాంటి ప్రేమకు మన ప్రజాప్రతినిధులూ బందిలే. అందరి మాదిరిగానే వారి ప్రేమ వ్యవహారంలోనూ అనేక మలుపులున్నాయి. నేడు ప్రేమికుల దినోత్సవం (Valentines Day 2024) సందర్భంగా వారి ప్రేమ ప్రయాణం ఎలా మొదలై ఏవిధంగా సుఖాంతమైందో తెలుసుకుందాం.
ప్రజాప్రతినిధులు అంటే నిత్యం సభల్లో సమావేశాల్లో, ఎన్నికల ప్రచారాల్లో గంభీరంగా కనిపిస్తుంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితంలోకి తరచిచూస్తే మాత్రం మరో కోణం దాగి ఉంటుంది. వారి లోలోపల ప్రేమికులు దాగి ఉన్నాడని తెలుస్తుంది. పలువురు ఎమ్మెల్యేలూ ప్రేమను జయించిన వారే. ప్రస్తుతం రాజకీయాల్లో బీజీగా ఉన్నపట్టికి వారంతా తమ జీవితభాగస్వాములకు ప్రేమను పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
బోటులో పరిచయం పెళ్లితో ఒకరికొకరం :సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తాను చదువుకునే రోజుల్లో ప్రేమించిన గీతారెడ్డినే వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఓ బోటులో మొదలైంది. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్ బోటులో గీతారెడ్డిని తొలిసారి చూశారు. ఆమె కుటుంబ వివరాలు తెలుసుకునే క్రమంలో మొదలైన వారి పరిచయం తర్వాత స్నేహంగా మారింది. రేవంత్ స్వయంగా గ్రీటింగ్‌కార్డులు తయారుచేసి మరీ ఆమెకు పంపించేవారు. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది.
CM Revanth Reddy Love Story : మొదట రేవంత్‌రెడ్డి తన ప్రేమను గీతారెడ్డికి తెలియజేశారు. ఆయన వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నచ్చి ఆమె అంగీకరించారు. కొన్నాళ్ల తర్వాత వ్యవహారం పెద్దల వరకూ వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను కొన్నాళ్లు దూరంగా పంపారు. కొంతకాలం ఎడబాటు అనంతరం రేవంత్‌రెడ్డి నేరుగా గీతారెడ్డి తరఫు పెద్దలతో మాట్లాడి తన ప్రేమను గెలిపించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 1992లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
ప్రేమికుల రోజున మీ లవర్కు ఈ గిఫ్ట్ ఇవ్వండి - ఖర్చు తక్కువ ఎఫెక్ట్ ఎక్కువ!