Urban Development Organizations For YSRCP Leaders : ప్రజల సొంతింటి కల సాకారం చేయడం, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పించడం పట్టణాభివృద్ధి సంస్థల ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలోని 18 పట్టణాభివృద్ధి సంస్థలుంటే అందులో సింహభాగం ఆ పనిని గాలికొదిలేశాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ-తుడాను గత ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు, ప్రస్తుత తుడా ఛైర్మన్ మోహిత్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి సంస్థగా, మార్చుకున్నారు. తుడా ఖాళీ భూముల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించగా వచ్చిన దాదాపు 400 కోట్ల రూపాయల నిధులను చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి అడ్డగోలుగా వెచ్చిస్తున్నారు.
తుడా పరిధిలో కొత్త లేఅవుట్లకు అనుమతులు భూ వినియోగ మార్పిడి వ్యవహారాల్లో సొమ్ములివ్వందే పనులు జరగవనే పరిస్థితి తుడాలో ప్రస్తుతం ఉంది. తుడా నిధులతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన స్వగ్రామం తుమ్మలగుంటలో ఉన్న చెరువును దాదాపు 70 కోట్ల రూపాయలతో క్రీడా మైదానంగా మార్చారు. చెవిరెడ్డి చెప్పారని అధికారులు అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్ధంగా నిధులిచ్చారు. జాతీయ హరిత ట్రెబ్యునల్ అభ్యంతర పెట్టినా పనులు ఆగలేదు. తుడా పరిధిలోని నగరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు అరకొరగా కేటాయించారు.
Illegal layouts in Nellore: నుడా అనుమతి లేకుండా 100కుపైగా అక్రమ లేఅవుట్లు.. అధికార పార్టీ అండతోనే..!
ఇక విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ- వీఎమ్ఆర్డీఏను వైఎస్సార్సీపీ నేతలు జేబు సంస్థ తరహాలోనే వాడుకున్నారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని వైసీపీ కీలక నేతల నియోజకవర్గాల్లో వీఎమ్ఆర్డీఏ నిధులతో పనులు చేయించుకుని మిగతా ప్రాంతాలపై పక్షపాతం చూపించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నియోజకవర్గంలోని దేవరాపల్లిలో వీఎమ్ఆర్డీఏ పార్క్ నిర్మించేలా పనులు చేయించుకున్నారు. 2041 బృహత్తర ప్రణాళికలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి శివారు ప్రాంతాల్లోని వైసీపీ నేతల స్థలాల సమీపం నుంచి రహదారులకు ప్రతిపాదనలు చేశారనే విమర్శలున్నాయి. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన స్థలాల సమీపంలో కొత్త రోడ్లు ప్రతిపాదించి ఆయన భారీగా లబ్ధిపొందేలా అధికారులు మేలు చేశారు.
ఇక రాజధానిప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ - సీఆర్డీఏ పరిస్థితి మరీ ఘోరం. అమరావతిపై జగన్ కక్షగట్టి నిర్మాణాలు నిలిపి వేయడంతో ఆ ప్రభావం సీఆర్డీఏ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. రాజధానిలో స్థిరాస్తి వ్యాపారమూ దెబ్బ తినడంతో సీఆర్డీఏపరిధిలో కొత్త లేఅవుట్లు అరకొరగానే ఏర్పడ్డాయి. అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణాలకు అనుమతుల కూడా తగ్గాయి. ఒక మాటలో చెప్పాలంటే సీఆర్డీఏని జగన్ ప్రభుత్వం ఉత్సవ విగ్రహంగా మార్చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కింద మధ్య తరగతి కుటుంబాల కోసం నవులూరులో 68.26 ఎకరాల్లో లేఅవుట్ వేయగా 386 ప్లాట్లే అమ్ముడుపోయాయి. రోడ్లు, కాలువలు, ఇతరత్రా నిర్మాణ పనులు పూర్తిచేయకపోవడం, గుత్తేదారులకు బిల్లులు బకాయిలు పెట్టడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. డబ్బు కట్టిన ప్రజలు లబోదిబోమంటున్నారు. సీఆర్డీఏపరిధిలో కొత్తగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులూ ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి.