14 Days Judicial Remand to Jani Master :ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్టోబరు 3 వరకు జానీ మాస్టర్ రిమాండ్‌లో ఉండనున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనను గురువారం గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జానీమాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
జానీమాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు :సహాయక నృత్య దర్శకురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు, 2019లోనే బాధితురాలు జానీ మాస్టర్‌కు పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు పేర్కొన్నారు. 2020లో ముంబయిలోని ఓ హోటల్‌లో బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, అప్పుడు బాధితురాలి వయసు పదహారేళ్లు మాత్రమేనని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు వివరించారు.
ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించడం సహా తన పలుకుబడి ఉపమోగించి బాధితురాలికి అవకాశాలు రాకుండా అడ్డుకున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు వివరించారు. అటు జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇదీ కేసు నేపథ్యం :తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయ కొరియోగ్రాఫర్ ఈనెల 15న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నార్సింగి ఠాణాకు బదిలీ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించిన పోలీసులు యువతి మైనర్‌గా ఉన్నప్పుటి(2019) నుంచి లైంగిక దాడి జరుగుతున్నట్లు నిర్థారించుకుని ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా పోక్సో సెక్షన్‌ను చేర్చారు.