Fake RTO Official Extortion Scandal in Uppal : అతనో ఓ ఆటోడ్రైవర్. అక్రమ సంపాదన కోసం నకిలీ ఆర్టీవో అవతారమెత్తాడు. రోడ్డుపై వాహనాలను ఆపుతూ సరైన పత్రాలు లేవని డబ్బులు వసూలు చేసేవాడు. ఈ దందాలో మరొకరిని భాగస్వామ్యం చేశాడు. అతడి చేత ఆర్టీవో అధికారి వేషం వేయించి మిగతా తతంగం ఇతను నడిపించాడు. కొద్దిరోజులు వీరి దందా బాగానే సాగింది. వీరి వలకు చిక్కిన వాహనదారులు మోసపోయామని గ్రహించి పోలీసులకు పట్టించడంతో ఈ గుట్టు బయటపడింది.
ఈ ఘటన తెలంగాణలోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ఈ నకిలీ ఆర్టీవోల దందాను చూసిన పోలీసులకే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోజు తెల్లవారుజామున 4గంటల నుంచే వీరి దందా మొదలవుతోంది. ఉదయం 7గంటల లోపు ముగించుకుంటారు. ఇందుకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిందితుల్లో ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఆటోడ్రైవర్ కాగా సంతోష్ అడ్డా కూలీ కావడం విశేషం. వీరిద్దరూ నకిలీ ఆర్టీవోలుగా అవతారమెత్తి వాహనదారులను లక్ష్యంగా చేసుకొని దందా చేస్తున్నారు.
నకిలీ ఆర్టీవోకు రోజుకు రూ.500 కూలీ : నకిలీ ఆర్టీవోల దందాకు సూత్రధారి ప్రేమ్‌కుమార్‌రెడ్డిగానే సమాచారం. కారులో ఆర్టీవో పాత్ర సంతోష్ పోషిస్తున్నాడు. రోజూ ఉదయం కారులో సంతోష్‌ను తీసుకొని ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఘట్‌కేసర్, బోడుప్పల్, ఉప్పల్, నాగోల్, మేడిపల్లి ప్రాంతాలకు వెళ్తాడు. కారులో సంతోష్‌ను కూర్చొబెట్టి చేతిలో ల్యాప్‌టాప్, రశీదు పుస్తకాలు ఉంచి వచ్చిపోయే వాహనాలను ప్రేమ్‌కుమార్‌రెడ్డి ఆపుతూ ఉంటాడు.