Heavy Rains In Few Districts :ఉపరితల ఆవర్తన ప్రభావంతోవాతావరణం ఒక్కసారిగా మారడంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని, కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాలతో రోడ్లపై నీరు చేరి వాహనదారుల ప్రయాణాలకు అంతరాయం కలిగించింది.
"అకాల వర్షంతో ఎండబోసిన ధాన్యం తడిసి ముద్దవడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని యెడల రాస్తారోకోలు చేసి నిరసన తెలియజేస్తాం'- రైతులు
Untimely Rains in Medak :ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పాపన్నపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. సంగారెడ్డి పట్టణంలో దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగి నీరు రోడ్లపై నిలిచింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వర్షపునీరు భారీగా నిలిచింది పోతిరెడ్డిపల్లి చౌరస్తా పరిసర ప్రాంతంలో డ్రైనేజీలు నిండి పొంగిపొర్లాయి. గాలి దుమారంతో భారీ కేట్లతో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుమీద పడ్డాయి.