Cancer Screening Programme In Tirupathi :క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మహిళలు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతుంది. జీవనశైలిలో మార్పులు, ఆహారంలో పోషకాల లేమి, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ఏపీలోని తిరుపతి జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో స్వీకార్ వైద్యులు, స్విమ్స్ ఏర్పాటు చేసిన పింక్ బస్సులు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. స్వీకార్ 48,000 పరీక్షలు నిర్వహించగా, స్విమ్స్ ఈ ఏడాదిలోనే 9,584 మందికి పరీక్షలు చేసింది. అనుమానితులను గుర్తించి తదుపరి చికిత్సలు అందిస్తున్నారు. కేసులు తక్కువగా నమోదైన ప్రజల్లో క్యాన్సర్‌పై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వ చర్యలు ఇలా : ఏపీలో ఏపీఎన్‌సీడీ సర్వే కోసం జిల్లాలో 900 మందికి పైగా మెడికల్ అధికారులు, సీహెచ్‌వోలు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వీరు వారానికి 45 మందిని సర్వే చేయనున్నారు. తర్వాత ఆ వివరాలు ‘ఈ-బ్యాక్’ అనే సైట్‌లో పెడతారు. షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వాటి గురించి ముందుస్తుగా ఏఎన్‌ఎంలు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు మెడికల్ అధికారులు, సీహెచ్‌వోలు కలిసి ఇంటింటి సర్వే చేస్తారు. సీహెచ్‌ల్లో ‘వయా’ పరీక్షల ద్వారా అనుమానితులను గుర్తించడం జరుగుతుంది.
రుయాలోని క్యాన్సర్ నివారణ విభాగానికి పంపిస్తారు. త్వరలో ఈ విభాగం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ సర్వే 18 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 30 ఏళ్లు పైబడిన స్త్రీలందరికీ తప్పనిసరిగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు క్యాన్సర్ ముప్పు బారినపడే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.