BJP Salute Telangana Rally :కేంద్రమంత్రిగా నియామకమైన తర్వాత కిషన్ రెడ్డి మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట విమానాశ్రయం వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహిళా మోర్చా నేతలు మంగళ హారతులో స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు "సెల్యూట్ తెలంగాణ" పేరుతో బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు.
మండు టెండల్లో సైతం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి 36 శాతం ఓటు బ్యాంకు సాధించినందుకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీని ప్రజలు 14శాతం ఓటు బ్యాంకు నుంచి ఒకేసారి 36 శాతానికి పెంచి ఆశీర్వదించారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలిపారు. ఓట్లు, సీట్లు సంఖ్యను పెంచినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎనిమిది స్థానాల్లో జయకేతనం.. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దేశంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరవాత మొదటిసారి మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డికి బొగ్గు గనులశాఖను కేటాయించగా, బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు.