Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation in Khammam : ఇటీవలి వరదలు ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి. మున్నేరు వరద ఉద్ధృతికి వేలాది ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం సంభవించింది. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే నిర్వహించారు. మున్నేరు, మధిరలో కట్టలేరు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పాలేరు కాలువను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి కేంద్రమంత్రులు పరిశీలించారు.
అనంతరం నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వర్ష బీభత్సానికి జరిగిన నష్టంపై ఎగ్జిబిషన్లో కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. చిత్ర ప్రదర్శన అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్రమంత్రితో తమకు జరిగిన నష్టాన్ని వివరించిన అన్నదాతలు, సర్వం కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి గురైన రైతును కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓదార్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
నేనూ రైతునే - కర్షకుల పరిస్థితులు బాగా తెలుసు : భారీ వరదలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, సంక్షోభ పరిస్థితుల్లో వారికి కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని కేంద్రమంత్రి ఆరోపించారు. ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆయన, ఆ పథకం అమలులో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. కనీసం ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని అన్నారు.