Kishan Reddy On Modi Govt : 2047లో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు పనిచేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ పాలనలో అందరికీ కూడు, గూడు, గుడ్డ కల్పించేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక వందరోజుల పాలన పూర్తి చేసుకున్నారని వివరించారు. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఏ పథకానికి ఎంత ఖర్చు చేసిందనే వివరాలను ఆయన వెల్లడించారు.
బీజేపీ పాలనలో మౌలిక వసుతుల అభివృద్ధి :బీజేపీ పాలనలో జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధి చేశామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కొసం రూ.15లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 20వేల కోట్లను వంద రోజుల్లో కిసాన్ సమ్మాన్ నిధి కోసం విడుదల చేశామని తెలిపారు. పంటల కనీస మద్దతు ధర పెంచామన్నారు. మత్స్య శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.
సెల్ఫోన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో నిలిచినట్లుగా కిషన్‌రెడ్డి వివరించారు. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సీటీలను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సీటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రూ.10 లక్షల ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచినట్లుగా వివరించారు. రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులకు మౌలిక సదుపాయాలో రూపకల్పన చేయడం జరిగిందన్నారు.