Union Minister Bandi Sanjay Fires On CM Revanth Reddy : ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా హైడ్రా, ప్రభుత్వ తీరు మారడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీ ఫొటో ఎగ్జిబిషన్లో పాల్గొన్న బండి సంజయ్, మోదీ దేశానికి చేసిన సేవ, ఆదర్శ జీవితాన్ని తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు స్వేచ్ఛ సేవా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
తెలంగాణలో ప్రజలు హైడ్రా కూల్చివేతల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మరోవైపు గ్రామాల్లోని సర్పంచ్లకు, ఎంపీటీసీలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా మోసం చేసిందో, కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. హైడ్రా వల్ల ఏదో జరుగుతుందని భావించామని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలకు తాము వ్యతిరేకం కాదని, చేపట్టే విధానాన్నే తప్పు పడుతున్నామని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కనపెట్టి, హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ పేదల ఇండ్లను ప్రభుత్వం కూలుస్తుందన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందని, హైడ్రా వల్ల తెలంగాణ అధోగతి పాలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూల్చడాన్ని బీజేపీ ఖండిస్తుందని, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బీజేపీ నాయకులను దాటిన తర్వాతే హైడ్రా కూల్చివేతల జోలికి వెళ్లాలని హెచ్చరించారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.