Knife Attack In Cinema Hall At Wardhannapet : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ థియేటర్‌లో కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే యువకుడిపై కత్తితో దాడి జరిగింది. దీంతో ప్రేక్షకులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో సినిమా ప్రదర్శన నిలిపి వేశారు. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఊర రాజ్‌కుమార్ అనే పాత ఇనుప సామాను వ్యాపారి వద్ద, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కళ్లెం విజయ్ గుమాస్తాగా పని చేస్తున్నాడు. 6 నెలల క్రితం రాజ్‌కుమార్ తమ్ముడు కృష్ణ తన కుమార్తె విషయంలో విజయ్‌తో గొడవ పడ్డాడు. పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ కృష్ణ, విజయ్‌పై పగ పెంచుకొన్నాడు. ఎలాగైనా విజయ్ను అంతమొందించాలనున్నాడు. విజయ్‌పై దాడి చేసేందుకు అదును కోసం చూస్తున్నాడు.
యాదాద్రి కలెక్టరేట్‌లో కత్తి పోటు కలకలం - అదే కారణమా?
ఈ నేపథ్యంలో శుక్రవారం వన భోజనాలకు రాజ్‌కుమార్ ఉమ్మడి కుటుంబ సభ్యులంతా వెళ్లారు. అనంతరం సాయంకాలం భారతీయుడు సినిమా మొదటి ఆట చూసేందుకు సుమారు 16 మంది కుటుంబసభ్యులు ఎస్‌వీఎస్ సినిమా టాకీస్‌కు వచ్చారు. వారిలో విజయ్ కూడా ఉన్నాడు. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల వ్యవధిలోనే కృష్ణ తనతో తెచ్చుకున్న కత్తితో విజయ్‌పై దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. ఘటనను అడ్డుకోబోయిన గంధం రాజ్‌కుమార్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు.
ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు : దాడి చేసిన అనంతరం నిందితుడు కృష్ణ అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ నర్సయ్య, సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన నిందితుడు కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ కార్యకర్త కత్తితో హల్ చల్