Two Men Killed Grand Father for Property Hanamkonda :ఈ మధ్యకాలంలో ఆస్తి తగాదాలతో హత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. బంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బు, ఆస్తిపై ఆశతో సొంతవారినీ కడతేరుస్తున్నారు. ఉల్లాసవంతమైన జీవనం పొందాలనే దురాషతో ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. అనంతరం జైలు పాలవుతున్నారు. తాజాగా ఆస్తి తగాదాను మనసులో పెట్టుకుని తాతను చంపారు ఇద్దరు మనమళ్లు. ఈ ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య, సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు చిన్న వయస్సులో మరణించగా, పెద్ద కుమారుడు రమేశ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో తొమ్మిదేళ్ల కిందట చనిపోయాడు. రమేశ్ భార్య రమాదేవి (40), కుమారులు సాయికృష్ణ (22), శశి కుమార్ (20)లు నాన్నమ్మ-తాతయ్యల పక్కనే వేరే ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సారయ్యకు 2 ఎకరాల భూమి ఉంది. ఇటీవల 4 గుంటలు అమ్మి వచ్చిన డబ్బులు కూమార్తెలకు ఇవ్వడంతో కోడలు, మనవళ్లు వాగ్వాదానికి దిగారు. వారికి రావాల్సిన ఆస్తి కుమార్తెలకు కట్టబెడుతున్నారని అప్పటి నుంచి తరచూ గొడవ పడేవారు. ఆదివారం ఉదయం కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో సారయ్య-సమ్మక్క దంపతులతో కోడలు, మనవళ్లు ఘర్షణకు దిగారు. ఘర్షణ వద్దని వృద్ధుడు సారయ్య వారిస్తున్నా కోడలు వారిపై గట్టిగట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలోనే మనవళ్లు వాకింగ్ స్టాండ్‌తో తాతపై దాడి చేశారు. బంధువులు, ఇరుగు పొరుగు వచ్చేసరికి అక్కడి నుంచి ఇద్దరు పారిపోయారు. తల, నుదుటిపై తీవ్ర గాయాలతో సారయ్య అక్కడికక్కడే చనిపోయాడు. సమ్మక్క ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.