Peddagattu Jathara Traffic in Suryapet District : సూర్యాపేట జిల్లా పెద్దగట్టు (గొల్లగట్టు) దురాజ్‌పల్లి లింగ మంతుల స్వామి జాతరకు రెండో రోజు జనాలు పోటెత్తారు. దీంతో కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ నుంచి భారీగా భక్తుల తాకిడి తీవ్రంగా పెరిగింది. భారీగా భక్తులు తరలిరావడంతో దాదాపు 2 కిలో మీటర్ల మేర రాకపోకలు నిలిచాయి.
దర్శించుకున్న ప్రముఖులు : స్వామివారిని ఈరోజు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డి దర్శించుకున్నారు. రెండు సంవత్సరాలకు ఒక సారి వచ్చే ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం : లింగమంతుల స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఆలంయంలో బారులు తీరారు. గొల్లగట్టు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. డప్పు వాయిద్యాలతో లింగమంతుల స్వామిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఓ లింగా ఓ లింగా అనే నామ స్మరణలతో గొల్లగట్టు ఆలయ ప్రాంగణం మార్మోగుతుంది. మహిళలు భక్తి శ్రద్ధలతో దేవుడికి బోనం సమర్పించి తమ కోరిన కోరికలు నెరవేరాలని ఆ లింగమంతుల స్వామిని వేడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ కాగా రెండో పెద్ద జాతర పెద్దగట్టు జాతర కావడం విశేషం.