Two Illegal Guns Seized by Visakha Police: ఎన్నికల వేళ విశాఖలో లైసెన్స్ లేని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. గత ఏడాది మార్చి 15న విశాఖ శ్రీకృష్ణా ట్రావెల్స్ ఆఫీస్ వద్ద ఝార్ఖండ్ నుంచి వచ్చిన కునాల్ అనే వ్యక్తి విశాఖ నుంచి బెంగళూరు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. మద్యం మత్తులో అనుమానాస్పందగా తిరుగుతుండటంతో ట్రావెల్స్ సిబ్బంది శివనాగరాజు ప్రశ్నించారు. అతని దగ్గర ఉన్న బ్యాగును తనిఖీ చేస్తుండగా కునాల్ తడబడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమయంలో బ్యాగు నుంచి ఒక ప్యాకెట్ కింద పడగా అందులో ఒక రివాల్వర్, పిస్తోలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. శివనాగరాజు వాటిని ట్రావెల్ కార్యాలయంలో భద్రపరిచి వాటితో ఫొటోలు దిగారు. అతని వద్ద ఈ ఆయుధాలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేసి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో 728 తుపాకులు స్వాధీనం- ఎన్నికల ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు: సీపీ
ఈ ఆయుధాలు వదిలి పారిపోయిన కునాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రివాల్వర్ ఇంగ్లండ్‌లో తయారైనట్లు పోలీసులు వెల్లడించారు. పిస్తోలుపై రెండు డాల్ఫిన్ ముద్రలు ఉన్నట్లు గుర్తించామన్నారు. శివనాగరాజు ఏడాదిగా తన వద్ద ఉంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. శివనాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగర పరిధిలో 783 మందికి ఆయుధాల లైసెన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే వాటిని ఆయా స్టేషన్లలో తీసుకున్నామని తెలిపారు.